AP Politics: కాకినాడ జిల్లా రాజకీయ అవగాహన, చైతన్యం అధికంగా ఉన్న ప్రాంతం. ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి హోదాలో ఉన్నారు. ఇంచార్జ్ మంత్రిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు. ఇక జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న నారాయణ అప్పుడప్పుడు చుట్టం చూపుగా కాకినాడకు వచ్చి వెళుతున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. ఇప్పటివరకు జిల్లాకు సంబంధించి పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశాలు కూడా పెట్టలేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. పైగా ఆయన జనసేనకు చెందినవారు. నియోజవర్గంలో ఏడు అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానాలు ఉంటే రెండు జనసేన నుంచి ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ ఎంపీ కూడా జనసేనకు చెందిన వారే ఉండటం గమనార్హం..
ఇప్పుడు జిల్లా ఎమ్మెల్యేలకు ఇదే పెద్ద సమస్యగా మారింది. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. వారంతా నేరుగా తమ జిల్లా మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసే అవకాశం లేదు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయితే తమ మనసులో మాట ఎవరికి చెప్పాలి. జిల్లాకు సంబంధించి అందరితో కలిసి మెలిసి వెళ్లే ఓ ప్రజా ప్రతినిధిని తెలుగుదేశం తరఫున నియమించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఎట్టకేలకు ఆ బాధ్యత ఆ ఎంపీకి దక్కింది. వాస్తవానికి ఆ ఎంపీ కాకినాడలో పుట్టి పెరిగినా ఆయన ఇక్కడ ఉన్నది తక్కువే. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వ్యవహారాలలో బిజీగా ఉంటూ విజయవాడ, హైదరాబాదులకే పరిమితం అయ్యేవారు. ఆయనే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్.
ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన సాన సతీష్‌కు కాకినాడ జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. కానీ ఆయన పెద్దగా పార్టీలో తిరిగింది లేదు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన పేరు బయటికి వచ్చింది. కోనసీమ జిల్లాలో నుంచి కాకినాడలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టింది మొదలు కాకినాడ జిల్లా దాటేవరకు మొత్తం సతీష్ పాదయాత్రను పర్యవేక్షించారు. ఆర్థిక వనరులు ఆయనే పెట్టుకున్నారు. దీంతో ఆయనకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాపుల కోటాలో ఈ సీటిస్తే గెలుస్తారు అన్న సర్వేలు వచ్చాయి. కానీ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీచేస్తారని జనసేన పార్టీ గతంలోనే ప్రకటించింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగేందుకు రెడీ కావడంఓ జనసేనకు కాకినాడ ఎంపీ టికెట్ దక్కింది. పవన్ ఆ సీటును ఉదయ శ్రీనివాస్‌కు కేటాయించారు. అయితే పొత్తులో ఈ సీటు జనసేనకు ఇవ్వాల్సి వస్తే సతీష్ కు జనసేన కండువా వేసి టికెట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఉదయ శ్రీనివాస్ పేరును పవన్ ప్రతిపాదించారు. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు కాదనలేకపోయారు. మళ్ళీ సతీష్ సైలెంట్ అయిపోయారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. సానా సతీష్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు..
ఆ తర్వాత వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో టీడీపీ కోటాలో సాన సతీష్‌కు రాజ్యసభ పదవి దక్కిడంతో ఆయన ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయనకే కాకినాడ జిల్లా బాధ్యతలు అప్పగించారు. టిడిపి తరఫున పార్టీ , ప్రభుత్వ పరంగా జిల్లాలో వ్యవహారాలన్నీ చూస్తారని ప్రజా దర్బార్ సందర్భంగా చెప్పకనే చెప్పారు నాయకులు. ప్రతి బుధవారం తాను స్వయంగా కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని సతీష్ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఏటా వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాకినాడ జిల్లాకు ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పెద్దదిక్కుగా మారారు. అన్ని నియోజవర్గాలు, మండలాల నుంచి నాయకులు ఆయన్ని కలుస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. సాన సతీష్ అన్ని వ్యవహారాలు చూస్తుండటంతో కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఉదయ శ్రీనివాస్ ప్రాధాన్యత తగ్గినట్లు అయింది. అదేవిధంగా జిల్లాకు టిడిపి మంత్రి నుంచి లేరన్న నిరాశ పోయింది. ఈ క్రమంలోనే నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం పూర్తిగా సతీష్ సత్కార సభగా మారిందని నాయకులే అంగీకరించారు.
కానీ ఇక్కడే మరో ప్రశ్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. క్యాడర్‌కు ఎదురవుతోంది. రాజ్యసభ సభ్యునిగా, టిడిపి కాకినాడ జిల్లా ప్రతినిధిగా ఆయనకు బాధ్యతలు అప్పగించినా ఆయన ఎంత మేరకు అందుబాటులో ఉంటారనేది చర్చగా మారింది. ఆయన దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త. గతంలో వైసిపి కి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తతో కలిసి వ్యాపారం చేశారు. ఇప్పటికీ కొందరు వైసిపి నేతలు ఆయనకు టచ్ లో ఉన్నారన్న ప్రచారం ఉంది. అదేవిధంగా ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగానూ ఎన్నికయ్యారు. విదేశాల్లో సైతం సతీష్ కు వ్యాపారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఆయన అందుబాటులో ఉంటారు. సామాన్య కార్యకర్తలను కలిసే అవకాశం ఉంటుందా అన్న చర్చ పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. ఆయన చుట్టూ బౌన్సర్లు ఉంటారు. ఇలా బౌన్సర్లను పెట్టుకు తిరిగే నాయకుడు జనాల్లో కలిసిపోగలుగుతారా అంటూ సామాన్య ప్రజలు సైతం అడుగుతున్నారు.
చంద్రబాబు సతీష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. లోకేష్ సిఫార్స్ తోనే సానా సతీష్ కు రాజ్యసభ దక్కింది అన్నది అందరికీ తెలుసు. దీంతో కాకినాడ జిల్లాను ఎంపీ సతీష్ ఎలా తీర్చిదిద్దుతారు.. ప్రజలను కలిసే అవకాశం కల్పిస్తారా.. ప్రతి బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో విచ్చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతుండగానే మొదటి ప్రజాదర్బార్ ముగిసింది. ఈ ప్రజా దర్భార్‌లో పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేసి వారి సమస్యలు చెప్పారు. కాకినాడ రూరల్, పిఠాపురం నియోజవర్గంలలో పార్టీ ఉనికి కోల్పోతోంది. ఇక్కడ ఇంచార్జ్‌లకు కూడా సమాచారం ఉండడం లేదు. అటు కాకినాడ రూరల్ కు ఇంచార్జ్ లేరంటూ కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మరోవైపు పార్టీ కార్యాలయంలో ఈ దర్బార్ నిర్వహిస్తే కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలు కలిసే అవకాశం ఉండదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతలు చంద్రబాబు లోకేష్ ఆయనకు ఇచ్చిన బాధ్యతలను ఏ స్థాయిలో నెరవేరుస్తారనేది మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.









