)
MLA Vs Kakinada Municipal Corporation Commissioner: కాకినాడ జిల్లా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్డా..! పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా గెలిచాక.. జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. అటు ఎమ్మెల్యేల నుంచి అధికారుల వరకు ఎవరు ఏం చేసినా పవన్ కు వెంటనే సమాచారం వెళ్తోంది. కానీ కాకినాడలో ఇప్పుడు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తీరుపై అధికారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాకినాడ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయాలు నిధులు మంజూరు చేస్తుంటే.. ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ కమిషనర్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. చివరకు కమిషనర్ బదిలీ కోసం ఎమ్మెల్యే ప్రభుత్వానికి సిఫారసు చేయడం సంచలనంగా మారింది.
కాకినాడ నగరం పూర్తిగా నగరపాలక సంస్థ పరిధిలోనే ఉంది. గతేడాది నగరపాలక సంస్థ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి భావనకు బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఒకటి రెండు దఫాలు మినహా మిగిలిన వారంతా నాన్ ఐఏఎస్ లే ఉండేవారు. దీంతో ప్రజా ప్రతినిధులకు ఆడింది ఆట.. పాడింది పాటగా ఉండేది. వారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ కమిషనర్లు పెట్టేసేవారు. టెండర్లు పిలవకుండా వర్క్ లు ఇచ్చేవారు. కోట్ల రూపాయలు చేతులు మారేవి. కానీ కమిషనర్ భావన పూర్తిగా నిబంధనల ప్రకారం పని చేస్తానని తనపై ఒత్తిడి తెచ్చినా లొంగేదీ లేదని స్పష్టం చేస్తున్నారు.
దీంతో కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఏం చెప్పినా కమిషనర్ వినడం లేదు. నిబంధనల ప్రకారమే చేస్తానంటున్నారు. దీంతో తామేం కావాలని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇంతకీ వారి బాధ ఏమిటంటే ఇటు నగరపాలక సంస్థ, అటు స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టే కాంట్రాక్ట్ లను టెండర్లు పిలవకుండా ముక్కలుగా విడదీసి నామినేషన్ పద్దతిలో తమకు అప్పగించాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. కమిషనర్ ససేమిరా వినేది లేదన్నారు. ఎమ్మెల్యే ఆటలు సాగడం లేదని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
ప్రస్తుతం కమిషనర్ భావనకు ఐఏఎస్ క్యాడర్లో మంచి పేరు ఉంది. ఇక్కడ జరుగుతున్న విషయాలను ఆమె ఐఏఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతో ఆమెకు మద్దతుగా అధికారులు సైతం నిలుస్తున్నట్టు సమాచారం. దీంతో నిబంధనల ప్రకారం సూచించిన ఏ పనైనా చేయడానికి సిద్ధమే. నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి సంతకం పెట్టేది లేదు. అనంతరం తన సర్వీస్‌పై ప్రభావం పడుతుందని ఆమె స్పష్టం చేస్తున్నారు. దాంతో కమిషనర్ తమను పట్టించుకోవడం లేదంటూ బదిలీ చేయించాలంటూ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ ఎదుట వాపోయారట. తనకు మద్దతుగా కొందరు కాంట్రాక్టర్లను సైతం తన వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ కాంట్రాక్టర్ డబ్బులు అడిగితే కేసు పెట్టారని మంత్రి ముందు తన గోడు వెళ్లబోసుకున్నారట. అందుకే ఆమెను బదిలీ చేయాలని మంత్రిని అందరూ కలిసి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అధికారులు తీరు మాత్రం మరోలా ఉందట. సదరు కాంట్రాక్టర్ కమిషనర్ ను బూతులు తిట్టడంతోనే ఆమె కేసు పెట్టారని అంటున్నారు.
కొద్దిరోజులుగా కమిషనర్ భావన నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే కొండబాబు హాజరు కావడం లేదు. కానీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాత్రం సమవేశాలకు హాజరవుతున్నారు. ఆమె నిబంధనల ప్రకారం వెళ్తున్నారని అందుకే ఎమ్మెల్సీ సమావేశాలకు హాజరవుతున్నారని కూటమి నేతలు అంగీకరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కొండబాబు మాత్రం కాంట్రాక్టులు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ పారిశుద్ధ్య కాంట్రాక్టు ఇలా అన్నింటిలో వేలు పెట్టడంతో తనకి ఇబ్బందులు వస్తున్నాయని కమిషనర్ వాపోతున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు నేతల సమస్యలు విన్నా మంత్రి నారాయణ ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుని పరిశీలించారట. ఇందులో కమిషనర్ పై ఎలాంటి ఆరోపణలు లేవు. కేవలం ఎమ్మెల్యే చెప్పిన మాట మాత్రం వినడం లేదన్నది ఒకటే ఆరోపణగా గుర్తించారట. అయితే గత వైసిపి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు విని అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాన్ని కొందరు ఐఏఎస్ లు గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమిషనర్ భావన తనకు చెడ్డపేరు వచ్చే పనులు చేయకుండా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఎమ్మెల్యే ఆమెను ఇక్కడి నుంచి పంపేయాలని చూస్తున్నారు.. కానీ ప్రభుత్వం మాత్రం కమిషనర్ కే మద్దతు ఇవ్వడంతో ఆయనకి ఏం చేయాలో పాలు పోవడం లేదని ప్రచారం సాగుతోంది.
మరోవైపు కమిషనర్ భావన పనితీరును ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ అభినందిస్తున్నారు. ప్రజలు అవసరాలకు పెద్దపీట వేస్తున్నారు. పారదర్శకంగా పనిచేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. ఇది ఎమ్మెల్యేకు మరింత కంటగింపుగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇటు ఎమ్మెల్సీ, అటు ఎంపీతో ఎమ్మెల్యేకు పడడం లేదు. నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అన్న తరహాలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు.
అందుకే అధికారులు ఆయనను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ను పక్కన పెట్టేసి తాను ప్రత్యేకంగా అదనపు కమిషనర్‌గా తనకు కావలసిన అధికారిని ఇక్కడ నియమింపజేసుకున్నారు. ఆయన ద్వారా తన పనులు చేయించుకుందామని ప్రయత్నం చేసారు. కానీ కమిషనర్ అధికారులు, సిబ్బందితో సమావేశం పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పనులు చేస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించడంతో ఎమ్మెల్యేకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయిందని టీడీపీ నాయకులు అంగీకరిస్తున్నారు.
మొత్తంమీద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటరివారయ్యారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో ఆయనకు తీవ్ర విభేదాలు పెట్టుకున్నారు. మరోపక్క టీడీపీకి చెందిన నగర మాజీ అధ్యక్షులు నున్న దొరబాబు ఎమ్మెల్యే పనితీరు నచ్చక ఎంపి ఉదయ శ్రీనివాస్ కలిసి తిరుగుతున్నారు. అలాగే జనసేన సిటీ అధ్యక్షుడు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్యే మధ్య కూడా సమన్వయం కొరవడింది. ఇక ఇంటి పోరు సరే సరి. తన సోదరుడు కుమారుడు ఉమాశంకర్ యువతను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా టీడీపీలో తన పట్టును పెంచుకుంటూనే మరోపక్క జనసేనను ఆకర్షిస్తున్నాడు. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఎమ్మెల్యే కొండబాబుకు కమిషనర్ భావన కొరకరాని కొయ్యగా మారడంతో ఆయన అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ కమిషనర్ ను బదిలీ చేయకపోతే తాను సైలెంట్ అవుతానని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.