)
Kurnool Bus Accident: మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానాలకు చేరుకుంటారనుకున్న ప్రయాణికులకు అదే ఆఖరి రోజు అవుతుందని అనుకోలేదు. ఉదయం కాగానే తమ బంధు మిత్రులను కలుస్తామనుకున్న వాళ్లు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో ప్రయాణికుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మొత్తం 32 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మరో 12 మంది తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikranth Patil) కీలక ప్రకటన చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిశాయన్నారు. మరి కాసేపట్లో స్పాట్‌కు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంటుందని వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సును టూవీలర్ బైక్ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. పొగను గమనించి స్థానికులు ప్రయాణికులను కాపాడేందుకు బస్సు అద్దాలను పగలగొట్టారు. కొంత మంది బయటపడినా.. మరికొంతమంది బయటకు రాలేకపోయారని తెలిపారు. మంటలతో బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. రెండో డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు కూడా అంచనా వేయలేకపోయారన్నారు. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు కూడా సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. అనంతరం క్షతగాత్రులను స్థానికులతో పాటు వాహనదారులు ఆస్పత్రికి తరలించారని ఎస్పీ తెలిపారు.
అయితే బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టిన తర్వాత బండిని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. దీంతో బస్పు డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బైకు ను నడుపుతున్న ద్విచక్రవాహనదారుడు స్పాట్ లో మృతి చెందాడు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ ఢీ కొట్టిన తర్వాత బస్సును ఆపి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సును ఆపకపోవడంతో పాటు బైకును దాదాపు అర కిలోమీటరుకు వరకు లాక్కెళ్లడంతో మంటలు చెలరేగాయి. అవి బస్సు డీజిల్ టాంకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పైగా కూర్చొని వెళ్లే బస్సులో అయితే.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడేవారు. స్లీపర్ బస్సు కావడం.. మొత్తం మూసేసి ఉండటం మూలానా.. ప్రయాణికులు ఈ ఘటన తెలుసుకొని అప్రమత్తమయ్యే లోపు జరగాల్సిన పని జరిగిపోతుంది. కొంత మంది వృద్దులు , బయటకు వెళ్లలేక స్పాట్ లోనే కాలి బూడిద అయ్యారు. మొత్తంగా వాహన దారుడిని గుర్తించపోవడంతో పాటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఇంత మంది ప్రాణాలు బలి కావడానికి కారణామైందనే విషయం స్పష్టమైంది. మరోవైపు ప్రయాణికులను అప్రమత్తం చేయడంలో విఫలం కావడం వంటివి ఈ దుర్ఘటనలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైనట్టు స్పష్టమవుతోంది.
కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనను అధికారులు దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్ విజయానంద్, కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
బస్సు ప్రమాదంపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాల వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటన ఎంతో బాధాకరమైందన్నారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. ఈ ప్రయాణ ఘటన పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.