Anakapalle Fire Accident: ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో అకస్మాత్తుగా మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు సామర్థ్యం కలిగిన పదార్థాలు మంటల్లో చిక్కుకుపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు.. భారీ మంటలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఏం జరిగిందో తెలియక స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఆ ప్రమాద ధాటికి 8 మంది మృతి చెందారని సమాచారం. కానీ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అతి కష్టంగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతలతో మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం సంభవించినట్లు పోలీస్ ప్రాథమికంగా నిర్ధారించారు.
కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు అడిగి వివరాలు తెలుసుకున్నారు.









