)
Nellore Airport Works: నెల్లూరు ఎయిర్ పోర్ట్ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ మొదటి దశ పనుల కోసం ప్రభుత్వం రూ. 916 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విమానాశ్రయం నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య, జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందంటున్నారు. అలాగే పరిశ్రమలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.ఏపీఏడీసీఎల్ దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇంటర్నేషనల్ టెండరును పిలిచింది. ఈ మేరకు అక్టోబర్ 10న ప్రీబిడ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.. ఈ బిడ్ల దాఖలకు నవంబరు 3వ తేది తుది గడువుగా నిర్ణయించారు. ఈ విమానాశ్రయాన్ని PPP విధానంలో నిర్మించాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నిర్ణయించింది. పారిశ్రామికంగా, పర్యాటకంగా జిల్లాలో కార్యకలాపాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మించే సంస్థతో రాయితీ ఒప్పందం 45 ఏళ్ల పాటు అమలులో ఉండేలా ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ప్రతి 15 ఏళ్లకు ఒక దశగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా మారుస్తారు.ప్రభుత్వం మూడు దశల్లో ఈ అభివృద్ధిని చేస్తుంది.
మొదటి 15 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా.. రెండవ దశలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. మూడవ దశలో ప్రయాణికుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, కార్గోసేవలకు అనుగుణంగా సర్దుబాటు చేసేలా ప్లాన్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి మొదట్లో ఎయిర్‌బస్ ఎ-320/ఎ-321 రకం మీడియం సైజు విమానాలు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దగదర్తిలో ప్రస్తుతం ఒక రన్‌వే మాత్రమే నిర్మాణం చేయనున్నారు.
నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో విమానాశ్రయం నిర్మాణానికి 2016లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం టర్బో కన్సార్షియం ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు విమానాశ్రయ నిర్మాణ పనులను అప్పగించింది. గత ప్రభుత్వ హయాంలో ఆ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత దగదర్తి బదులు ప్రకాశం జిల్లాలోని తెట్టు దగ్గర విమానాశ్రయం నిర్మించాలని భావించారు. కానీ గత ఐదేళ్లలో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో దగదర్తి విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టింది. దగదర్తిలో విమానాశ్రయం కోసం దాదాపు 1,300 ఎకరాల భూమిని సేకరించారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు కూడా లభించాయి. రక్షణ శాఖ, హోంశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. పర్యావరణ, అటవీ శాఖల నుంచి 2017లోనే అనుమతులు వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.