Pahalgam Attack: 'ఉగ్రవాదులు అలా కాల్చేశారు.. ఆ ఐదు నిమిషాలు ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉన్నాం..'

What Happened in Pahalgam: పెహల్గామ్‌లో ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు..? అక్కడ అమాయకులైన పర్యాటకులను గన్స్‌తో ఎలా కాల్చారు..? టెర్రరిస్టుల నుంచి ప్రాణాలను ఉగ్గపట్టుకుని తప్పించుకున్న విశాఖకు చెందిన శశిధర్.. పెహల్గామ్ ఘటన గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 26, 2025, 04:45 PM IST
Pahalgam Attack: 'ఉగ్రవాదులు అలా కాల్చేశారు.. ఆ ఐదు నిమిషాలు ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉన్నాం..'

What Happened in Pahalgam: పెహల్గామ్ ఉగ్రదాడిలో విశాఖకు చెందిన విశ్రాంతి ఉద్యోగి చంద్రమౌళి మరణించిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీన చంద్రమౌళితో పాటు ఆయన భార్య, మరికొంతమంది స్నేహితులు విశాఖ నుంచి జమ్మూ కశ్మీర్‌ను సందర్శించేందుకు వెళ్లారు. ఊహించని విధంగా జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపుగా 27 మందితో మరణించగా.. వారిలో చంద్రమౌళి కూడా ఉన్నారు. చంద్రమౌళితో పాటు వెళ్లిన ఆయన స్నేహితులు శశిధర్ జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడారు. అక్కడ ఉగ్రదాడి ఎలా జరిగింది..? వాళ్లు ఎలా తప్పించుకున్నారు..? చంద్రమౌళి ఎలా మరణించారు..? అనే విషయాలు ఆయన మాటలోనే..

Add Zee News as a Preferred Source

"మేము ఇక్కడ నుంచి 18వ తేదీన బయలుదేరి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ గుల్మార్గు, సోనా మార్గు, శ్రీనగర్ మూడు ప్లేసెస్ చూసి తర్వాత 22వ తారీకున పెహల్గాం వెళ్ళాము. అక్కడికి వెళ్లేసరికి మధ్యాహ్నం 12 అట్లా అయింది. అక్కడి స్పెసిఫిక్ లొకేషన్‌ను మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడికి వెళ్ళాలంటే గుర్రాల మీదనే వెళ్ళాలి లేదా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నారు. సో గుర్రాల మీదనే వెళ్ళామండి. అది చాలా కష్టంగా ఉంది. రాళ్లుు రప్పలు వాటి మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది. ఒక సగం దూరం వరకు వెళ్ళినాక ఆడవాళ్ళేమో చాలా కష్టంగా ఉంది.. ఇంకా మరి వెళ్ళాము మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అన్నారు. అయితే చంద్రమౌళి గారే ఇంత దూరం వచ్చాము.. కాస్త ఓపికపడితే
వెళ్ళిపోతామంటే మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేసి మీదకి వెళ్ళాము.

లోపలికి అదంతా ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్‌లా ఉంటుందండి. పెద్ద గోల్ఫ్ కోర్టు లాగా వన్ సైడ్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ వెనకన బ్యాక్ డ్రాప్‌లో హిమాలయస్ ఉంటుంది. అక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ క్యాంటీన్స్ ఉన్నాయి. మేము టాయిలెట్‌కు వెళ్లి.. క్యాంటీన్స్‌లో ఏదైనా తిందామని అనుకున్నాం. టాయిలెట్స్ అక్కడ నుంచి ఎంట్రన్స్ 150 మీటర్స్ అట్లా దూరంలో ఉంటుంది. అందరం మేము ఆరుగురం కూడా అక్కడికి వెళ్ళాం. ఇద్దరు ముగ్గురు మౌళి గారితో టాయిలెట్‌లోకి వెళ్లి బయటకి వచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళు వెళ్ళపోయేసరికి మాకు ఆ దూరంగా చెట్లు వైపు నుంచి ఎక్కడి నుంచో రెండు మూడు షాట్స్ వినబడ్డాయి. ఏమిటి గన్ షాట్స్.. ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అనుకుంటే ఎవరో ఏదో బర్డ్స్ ని హంట్ చేస్తున్నారు.. ఏదో అని అనుకున్నాం.. మళ్ళీ కాసేపటికి ఒక త్రీ టు ఫైవ్ షాట్స్ విన్నాం.. ఆడవాళ్ళ అరుపులు.. కేకలు విన్నాం.

మధ్యలో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చుని ఉన్నట్టు వాళ్ళ ముందున మనుషులు పడుకొని పడిపోయి ఉన్నట్టు ఒక కనబడింది. ఆ పక్కనే ఒక మనిషి గన్ పట్టుకొని వాళ్ళని ఏదో చేస్తూ.. ఇలా అంటూ చేతితో ఏదో అంటున్నట్టుగా కనబడింది. వాడు తర్వాత ఫైర్ చేస్తూ కనబడ్డాడు. వెంటనే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందని మనం వెంటనే దాక్కోవాలని చెప్పి.. మేము టాయిలెట్స్ వెనక్కి చేరిపోయాం. మేము ఆరుగురు.. మాతో పాటు ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్
ఉన్నాయి. వాళ్ళు కూడా వెనక్కి వచ్చేశారు.

మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దారి తెలియదు. ఎటు పోతామో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆలోచిస్తున్నాం.. ఇంతలో అక్కడ కాలుస్తున్న టెర్రరిస్ట్ ఒకడు మా వైపు రావడం మొదలు పెట్టాడు. అంతే అయితే ఇంకా మన వైపు వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పేసి ఎలాగా చూద్దాం అనేసరికి ఆ లోకల్‌గా ఉన్న ఒక టాయిలెట్ మెయింటైన్ చేసే బాయ్ పరిగెత్తుకుంటూ ఫెన్సింగ్ కింద నుంచి దూరి పారిపోయాడు. వెంటనే మేము చూశాం. మేము అటు పరిగెత్తుక వెళ్లి ఆ ఫెన్సింగ్ కింద నుంచి ఒకరికొకరు ఒకరికఒకరు జారి వెళ్ళాల్సి వచ్చింది. సో అది అక్కడ బాటిల్ నెక్. దాని వలన మేము అందరం వెంటనే బయట పడలేకపోయాం. చివరగా నా భార్య వచ్చింది.

ఆమె రాలేకపోతుంటే చంద్రమౌళి గారు హెల్ప్ చేసి బయటికి లాగారు. అక్కడ కొండవాలు మీద ఉన్న చెట్ల చాటుకు వెళ్లిపోయాం. మౌళి గారు కూడా చెట్ల చాటుకి వచ్చేశారు. నేను వెనక్కి చూసేసరికి టెర్రరిస్ట్ ఏమో ఆయనకి దగ్గరకపోయి.. వచ్చేసాడు. అది అర్థం కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అర్థమైంది. గాలిలో గాలిలో కాదు చెస్ట్ లెవెల్‌లో షూట్ చేసినట్టుగా కనబడింది. ఆయనకి 10 నుంచి 20 అడుగుల దూరంలో చెట్టు చాటున నా భార్య, ఇంకొక మా ఫ్రెండ్ శశి గారు కలిసి అక్కడ ఉన్నారు. వీళ్ళు టెర్రరిస్ట్‌ కనబడుతున్నాడు. వాడు వీళ్ళ వైపు రెండు అడుగులు వేసి లేడీస్ ఉన్నారని చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. నన్ను సెర్చ్ చేయలేదు. నేను ఇటు కొద్దిగా దూరంలో ఉన్నాను. పక్కన వేరే చెట్టు దగ్గర మాతో వచ్చిన అప్పన్న గారు ఉన్నారు. 

వాడు వెళ్లిపోయాక ఐదు నిమిషాల వరకు మేము ప్రాణాలు ఉగ్గపట్టుకుని ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయం.. ఇంకా ఎవరు ఎటు నుంచి వస్తారో అని భయం అలాగే కాసేపు.. ఉండి ఇంకా నెమ్మదిగా నేను మా వాళ్ళకి సై చేసి కిందకి దిగుదామన్నాను. ఇంతలో మీద నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వస్తూ అందరూ కిందకి బాగో బాగో బాగు చలో చలో అంటున్నారు. మేము నెమ్మదిగా ఒక రాళ్ళలోని గుట్టలో నుంచి అలాగా ఆ కొండల్లో నుంచి దిగుతూ వచ్చాము.."  అంటూ ఉగ్రదాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన శశిధర్ చెప్పుకొచ్చారు.

 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News