Pawan Kalyan: పిఠాపురంలో జనసేన ఇంచార్జ్‌కు చెక్.. పవన్ కళ్యాణ్‌ ప్లాన్ ఏంటి..?

Pawan Kalyan: పిఠాపురంలో జనసేన ఇంచార్జ్‌కు చెక్ పడిందా..! పిఠాపురంలో  ఇంచార్జ్ మర్రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో.. ఫైవ్ మెన్ కమిటీ ఆయన్ను పక్కన పెట్టిందా..! ఇన్నాళ్లు  సొంత పార్టీ నేతలను ఇంచార్జ్ పట్టించుకోకపోవడంతో.. పవన్‌కు ఇబ్బందిగా మారిందా..! త్వరలోనే పిఠాపురం జనసేనకు కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా..!   

Written by - G Shekhar | Last Updated : Nov 7, 2025, 03:01 PM IST
Pawan Kalyan: పిఠాపురంలో జనసేన ఇంచార్జ్‌కు చెక్.. పవన్ కళ్యాణ్‌ ప్లాన్ ఏంటి..?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మొట్టమొదటి విజయాన్ని అందించింది పిఠాపురం నియోజవర్గం. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఇంచార్జ్ ఎస్వీఎస్‌ఎన్ వర్మను కాదని పవన్ కళ్యాణ్ పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఉపముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా, సినీ హీరోగా ఇన్ని పాత్రలలో పనిచేస్తున్న ఆయనకు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల తరహాలో నిత్యం నియోజకవర్గంలో ఉండడం సాధ్యం కాదు. దీంతో తన సోదరుడు నాగబాబుకు సన్నిహితుడైన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నేత మర్రెడ్డి శ్రీనివాసరావును పిఠాపురం ఇంచార్జ్‌గా నియమించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనకు చెప్పాలి. దాంతో ఆయన డిప్యూటీ సీఎం పవన్‌కు చేరవేసేవారు. జిల్లా స్థాయిలో ఆయనే అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. అయితే మర్రెడ్డిపై జనసేన పాత కాపులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఆయన విభజించి పాలించు శైలితో వ్యవహరిస్తున్నారని ఆది నుంచి ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
 
ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. అంతకుముందు పిఠాపురం నుంచి చాలామంది జనసైనికులు టికెట్ కోసం ప్రయత్నించారు. పార్టీని బలపరిచేందుకు కోట్ల రూపాయల సొంత నిధులు వెచ్చించారు. వారందరూ మర్రెడ్డి రాకతో కనుమరుగైపోయారు. డాక్టర్ పిల్లా శ్రీధర్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నా చక్రధరరావు వంటి నేతలను మర్రెడ్డి పక్కన పెట్టేశారు. తనకంటూ ఓ గ్రూపును తయారు చేసుకున్నారు. దీంతో వీర మహిళలు కూడా ఆయనపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అయినప్పటికీ పవన్ పట్టించుకోలేదు. తాను నియమించిన ఇంచార్జి మాటే వినాలని చెప్పారు. అయితే రాను రాను ఆయన వ్యవహార శైలికి పార్టీలో నెగిటివ్ టాక్ వచ్చింది.
 
ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మతో జనసేనకు పొసగడం లేదు. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌తో సైతం సమన్వయం లేదు. కొత్తగా పార్టీలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోనూ అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ప్రతి నిత్యం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన పై ఆరోపణలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరోవైపు కుప్పంలో సీఎం చంద్రబాబు, మంగళగిరిలో మంత్రి లోకేష్ ను మించి ఆయన పిఠాపురంలో అభివృద్ధి జరుగుతోంది. వందల కోట్ల రూపాయలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. కానీ పవన్ కల్యాణ్ తనపేరును చిరస్థాయిలో నిలిచిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు అన్న పేరు కంటే కూడా పార్టీ ఇంచార్జ్ చేస్తున్న పెత్తనం పైనే ప్రజల్లోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. అందుకే పిఠాపురం జనసేన ఇంచార్జ్ కు చెక్ పెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. 
 
మరోవైపు పిఠాపురంలోనేన ఎమ్మెల్సీ నాగబాబు ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ ఆయన టీడీపీ ఇంచార్జ్ వర్మను టార్గెట్ చేయడంతో.. వివాదం మరింత ముదురుగుతోంది. అటు తెలుగు తమ్ముళ్లు జనసేనతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దాంతో నాగబాబుకు పిఠాపురంలో బ్రేక్ వేశారు. ఇప్పటికే ఓ ఇంచార్జ్‌ను పెట్టాక పవన్ కు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. అందుకే ఫైవ్ మెన్ కమిటీని వేసి అధికార వికేంద్రీకరణ వేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులుగా కమిటీ సభ్యులు ఇంచార్జ్ మర్రెడ్డికి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ఇప్పటికే  పిఠాపురంలో పార్టీ కార్యాలయం తొలగించి తిరిగి చేబ్రోలుకు మార్చేశారు. ఇది మర్రెడ్డికి పెద్ద దెబ్బ అంటున్నారు. అదేవిధంగా పాత కాపులకు కూడా సముచిత స్థానం కల్పిస్తే పిఠాపురానికి పవన్ శాశ్వత ఎమ్మెల్యే అని ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తున్నాయి. మధ్య మధ్యలో టీడీపీ ఇంచార్జ్ వర్మ ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. కనుమరుగైపోయారనుకున్న వైసిపి పిఠాపురం ఇన్చార్జ్ వంగా గీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలంటే జనసేన పాత కాపులను తెరమీదకి తేవాలని కోరుతున్నారు.
 
మొత్తం మీద ఫైవ్ మెన్ కమిటీ ద్వారా మర్రెడ్డి ఒంటరి వారయ్యారనే చర్చ జరుగుతోంది. ఇటీవల మొంథా తుఫాన్ సందర్భంగా ఆయన ఎక్కడ కనిపించలేదు. కానీ తుఫాను తగ్గిన తర్వాత వచ్చారు. సొంత పని మీద హైదరాబాద్ వెళ్ళానని చెప్పుకొచ్చారు. అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా కమిటీ వేసామని అధికారికంగా ప్రకటించారు. దీంతో పిఠాపురం నుంచి మర్రెడ్డిని తప్పించారని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్న టాక్ వినిపిస్తోంది. 

About the Author

Trending News