పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ఆగ్రహావేశాలు.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

    

Updated: Jul 11, 2018, 05:03 PM IST
పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ఆగ్రహావేశాలు.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామిని హైదరాబద్ నగరం నుంచి బహిష్కరించడంపై మద్దతుదారుల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమౌతున్నాయి.  హైదరాబాద్ పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ, ఏబీవీపీ, ఆరెస్సెస్  కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్ధపేటలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఆందోళన కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన వివరిమించాలని కోరారు. ఆందోళనకారులు మాట వినకపోవడంతో కొంత సేపు పోలీసులు- ఆందోళనకారుల మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా పట్టణంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.  

2017 నవంబర్ 1న మెదక్ జిల్లా రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఆరోపిస్తూ హైదరాబాద్ పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. వేటు నిర్ణయాన్ని వెంటేనే అమలు చేశారు. తెల్లవారుఝమున ఆయన్ను నగరం నుంచి తరలించారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన మద్దతు దారులు ఈ మేరకు ఆందోళన బాట పట్టారు. కాగా ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరగవచ్చనే కారణంతో హైద్రబాద్ తో సహా రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.