గ్రామ సచివాలయం పరీక్ష పత్రాలు లీక్ వ్యవహారం పై రగడ 

ఏపీ గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష పత్రాలు లీక్ అయినట్లు ఓ ప్రముఖ పత్రికలో కథనం రావడంతో ఈ వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది

Last Updated : Sep 20, 2019, 04:18 PM IST
గ్రామ సచివాలయం పరీక్ష పత్రాలు లీక్ వ్యవహారం పై రగడ 

జగన్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో గోల్ మాల్ జరిగినట్లు ఓ ప్రముఖ తెలుగు పత్రిక సంచలన కథనం ప్రచురించింది . ఈ సందర్భంగా ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని, ఓ ఉద్యోగి సోదరుడు, మరో ఏపీపీఎస్సీ అధికారి కుటుంబంలో టాప్ ర్యాంకులు  సాధించి ఉద్యోగాలు సాధించడమేంటని సదరు పత్రిక తెలిపింది. తాజా కథనంతో ఏపీలో ఒక్కసారిగా దుమారం చెలరేగుతోంది. పలు విద్యార్ధి సంఘాలు ఈ విషయంలో ఆందోళన బాట పట్టాయి. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. మరోవైపు అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది.

సచివాలయ లీక్ కు సంబంధించిన పత్రికా కథనాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ  ఇది భారీ కుంభకోణమని వ్యాఖ్యానించారు. అవినీతి పరుడికి అధికారమిస్తే పెద్ద అవినీతి చేస్తాడు..ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం నిరూపించింది. నిన్నటికి నిన్న గ్రామ వాలంటీర్ పోస్టులన్నింటిని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుని నిరుద్యోగులను మోసం చేశారనీ, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ల ఆశలను ఆవిరి చేశారని చంద్రబాబు విమర్శించారు. ఈ రోజు గ్రామ సచివాలయ పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసి భారీ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. లక్షలాది నిరుద్యోగులను ముఖ్యమంత్రి  దగా చేశారని చంద్రబాబు విమర్శలు సంధించారు. మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు మరో రకంగా స్పందిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుజేసేందుకు కుట్ర అని ప్రతిపక్షాల విమర్శలపై ఎదురు దాడి చేస్తున్నారు. . చంద్రబాబుకు కొమ్మకాసే ఓ పత్రిక ఈ  కథనాన్నిదురుద్దేశపూర్వకంగానే  రాసిందని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సచివాలయం పరీక్షల్లో టాప్ ర్యాంకు సాధించిన పలువురు సామాన్యులను ప్రస్తావిస్తున్నారు.  గ్రామ సచివాలయం పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తాన్ని అపహాస్యం చేసేందుకే ఇలాంటి కథనాలను రాస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇలా ఈ వ్యహారం ఏపీలో రాజకీయ వాాతావరణాన్ని అమాంతంగా వేడేక్కించేసింది. 

Trending News