మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగేళ్ళలో సుమారు రూ.27000 కోట్ల ఉపాధి హామీ నిధులు వచ్చాయని... ఆ నిధులతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే బాగుండేదని.. కానీ ఆయన అలా చేయలేదని మాణిక్యాలరావు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన నలభై హామీల్లో ఏ హామీని కూడా ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తే గెలవరని కొందరు టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారని.. కానీ తాను అదే గుర్తు మీద గెలిచే మంత్రిని అయ్యానని మాణిక్యాలరావు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే బీజేపీ ప్రభుత్వం ఏమీ కొందరు నేతలు చెబుతున్నట్లు అనుకూలమైన పోలీసు వ్యవస్థను నియమించుకోలేదని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే అని.. ఆంధ్రప్రదేశ్‌లో జరగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. అందుకు అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.  2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన మాణిక్యాలరావు... టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా 2014 శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.


పైడికొండల మాణిక్యాలరావు తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌)లో చేరారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన  పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే దేశ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. జై ఆంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. బీజేపీ ఆవిర్భవించిన నాటి నుంచీ అదే పార్టీలోనే కొనసాగుతున్నారు.