
Ram Charan Rangasthalam Movie Village: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి.. ప్రాజెక్టు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు గ్రామాల ప్రజలతో పాటు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సెంటిమెంట్‌గా మారిన గోదావరి పరివాహక గ్రామాలు గోదావరిలో జలసమాధి కానున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన గ్రామలన్నీ నేడు వెలవెలబోతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. పూడిపల్లి గ్రామం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.. ఈ గ్రామంలోనే వందల సంఖ్యలో సినిమాల షూటింగ్ జరిగింది. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దాంత దేవీపట్నం మండలంలోని గోదావరి తీరాన్న ఉన్న పూడిపల్లి సినిమా ఇండస్ట్రీకి ఓ సెంటిమెంట్‌గా మారింది. అటు అగ్రహీరోల హిట్లతో పూడిపల్లి గ్రామానికి మంచి పేరు వచ్చింది. 1983లో నయాకథమ్ రాజేష్ కన్నా హిందీ సినిమా షూటింగ్ పూడిపల్లిలో చేశారు.
ఆ చిత్రం హిట్ కావడంతో పూడిపల్లి గ్రామం పేరు మారుమోగింది. ఈ క్రమంలోనే అదే చిత్రాన్ని తెలుగులో త్రిశూలం పేరిట చిత్రీకరించడంతో హిట్ తెచ్చింది. ఆ తరువాత తాండ్ర పాపారాయుడు, జానకిరాముడు, ఆపద్బాంధవుడు, బంగారు బుల్లోడు, ఒక్కమగాడు చిత్ర నిర్మాణాలు ఈ గ్రామంలోనే ఎక్కువ రోజులు సాగాయి. ఇటీవలే టాలీవుడ్లో సంచలనం విజయం సాధించిన రంగస్థలం సినిమా ఎక్కువ సమయం షూటింగ్ ఈ గ్రామంలోనే జరిగింది. రామ్ చరణ్ కెరీర్లోనే తిరుగులేని హిట్ చిత్రంగా నిలిచిన రంగస్థలం సినిమాలో గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా కోసం అనేక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. దాంతో రంగస్థలం గ్రామంగా ఈ ఊరికి విపరీతమైన ప్రచారం లభించింది. ఎందరో అగ్ర హీరోలకు బంపర్ హిట్ ఇచ్చిన ఈ ఊరిలో ప్రస్తుతం జన సంచారం లేదు. గ్రామంలో ప్రస్తుతం జనాలు లేక మొండి గోడలు దర్శనమిస్తున్నాయి.
కానీ రంగస్థలం సినిమానే పూడిపల్లిలో చివరి షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో సినిమా షూటింగ్‌లు జరగలేదు. ఎందుకంటే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంత కావడంతో.. ఈ గ్రామాన్నీ అధికారులు ఖాళీ చేయించారు. దాంతో నిర్వాసితులంగా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా తరలివెళ్లారు. ఒకప్పుడు నిత్యం సినిమా షూటింగ్‌లతో కళకళలాడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు చూస్తుంటే బ్రతకడం ఎందుకు అని అనిపిస్తోందని స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నవారిని వదలి ఉండలేక అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్వాసితులకు సరైన నష్ట పరిహారం సైతం చెల్లించలేదని అంటున్నారు.
మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తమ బతుకులే ఆగమయ్యాయని అంటున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి.. పూడిపల్లి గ్రామస్తులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని.. తమను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైన ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద.. కాబట్టి ఆయనే తమకు సరైనా న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe