శబరిమల ఆలయ వివాదం: తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన నిరసన సెగలు

శబరిమల వివాదం అప్పయ్యను ఆధారించే తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకింది

Updated: Jan 3, 2019, 01:44 PM IST
శబరిమల ఆలయ వివాదం: తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన నిరసన సెగలు

శబరిమల వివాదం కేరళ రాష్ట్రానికే పరిమితం కాలేదు.. అయ్యప్పను ఆధారించే తెలుగు రాష్ట్రాల్లో కూడా పాకింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం హైదరాబాద్ భరత్ నగర్ లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి.. కేరళ ప్రభుత్వ తీరును ఖండించారు. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడలో శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఆందోళన భాగంగా రాస్తా రోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఈ ఆందోళణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

కేరళ రాష్ట్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన నేపథ్యంలో నిన్నటి నుంచి కేరళలో ఆందోళన చెలరేగుతున్న విషయం తెలిసిందే.  కేరళలో  ఎగసిన నిరసన సెగలు పక్క రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. శబరిమల అయ్యప్పను ఆధారించే వారు కేరళతో పాటు దక్షిణ భారత దేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఈ క్రమంలో ఇలా ఆందోళనలు విస్తరిస్తున్నాయి. ఆందోళనలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.