భారతిపై ఈడీ కేసు నమోదుచేసిందనడం షాక్‌కు గురిచేసింది: జగన్
వైఎస్ భారతి పేరును ఈడీ ఛార్జ్ షీటులో చేర్చినట్లు కథనాలు రావడంతో వైఎస్ జగన్ స్పందించారు.
వైఎస్ భారతి పేరును ఈడీ ఛార్జ్ షీటులో చేర్చినట్లు కథనాలు రావడంతో వైఎస్ జగన్ స్పందించారు. ఇది తనకు షాక్‌కు గురిచేసిందన్న జగన్.. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. సంబంధం లేని విషయాల్లో కుటుంబసభ్యులను లాగడం బాధాకరమన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతి పేరును ఛార్జ్ షీటులో ఈడీ చేర్చినట్లు ఉదయం నుంచి కథనాలు వెలువడ్డాయి. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ కార్పొరేషన్, జే.జగన్మోహన్ రెడ్డి, సిలికాన్ బిల్డర్, సండూర్ పవర్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు ఆమె పేరును చేర్చింది. సీబీఐ గతంలో దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో భారతీ పేరులేకపోగా.. తాజాగా ఆమె పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశంగా మారింది.