విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.   చిల్లర రాజకీయాలు చేసే చంద్రబాబును పక్కనపెట్టి రానున్న ఎన్నికల్లో మరో ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఓవైపు ఏపీ సర్కార్ రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఇబ్బందులు పడుతోందని, అభివృద్ధికి లోటు బడ్జెట్ ఓ ఆటంకంగా మారిందని చెబుతున్న చంద్రబాబు.. ధర్మపోరాట దీక్షలకు భారీ మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. గురువారం విజయవాడలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను విజయవాడ వస్తే పోలీసులను పంపించి ఆరా తీయిస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేసిన తలసాని.. తనకు ఏపీకి వచ్చే హక్కు లేదా ? విజయవాడలో ప్రెస్‌మీట్స్ పెట్టే హక్కు లేదా అని నిలదీశారు.


ఈ సందర్భంగా చంద్రబాబుపై మరిన్ని విమర్శలు ఎక్కుపెట్టిన తలసాని.. అవినీతిలో ఏపీ ముందుందని, ఏ పని కావాలన్నా కమిషన్ ఇవ్వనిదే పని జరగదని అన్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తుండగా... ఏపీలో మాత్రం చంద్రబాబు మాటలకే పరిమితం అయ్యారని బాబుని ఎద్దేవా చేశారు.