AP Politics: కాకినాడ జిల్లా పిఠాపురానికి మహారాజుల కోటనే పేరుంది. పిఠాపురం రాజా సూర్యరావు బహుదూర్ వేల ఎకరాల భూములు దేవాలయాలకు, విద్యాసంస్థలకు రాసిచ్చారు. ఇప్పటికీ అక్కడ రాజుగారి కోట ఉంది. అలాంటి పిఠాపురంలో టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఎస్వీఎస్‌ఎన్ వర్మ గత 25 ఏళ్లుగా రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. నిత్యం వెంట వందలాది మంది కార్యకర్తలు. ఎక్కడికి వెళ్లినా మంది మార్భలంతో హాజరవుతుంటారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఎన్ని కేసులు పెట్టినా, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కూలగొట్టినా ఎక్కడ తొణకలేదు. బెణకలేదు. తిరిగి నిలబడాలి అన్న విధంగా పోరాటం చేశారు. దీంతో 2024లో ఆయన గెలుపు సాధ్యం అనుకున్నారు. అంతే అక్కడే ఆయనకు గ్రహణం పట్టిందన్న ప్రచారం సాగుతోంది..
గత అసెంబ్లీ ఈఎన్నికల్లో పొత్తులో భాగంగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో వర్మ అలిగారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ బుజ్జగించారు. చివరకు వర్మ పవన్ కోసం కష్టపడ్డారు. ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించాలి. వర్మ మాస్ లీడర్. ఆయన ముఖస్థితి కోసం మాట్లాడడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. ఆయన లాంటి నాయకుడు ఉంటే నా గెలుపు ఓ చరిత్ర అవుతుంది. ఆయనకీ, ఆయన కుమారుడికి రుణపడి ఉంటాను అంటూ బహిరంగ సభలో వర్మ కోసం పవన్ ప్రకటించారు. వర్మను శాసనమండలికి మొదటిసారి తీసుకొస్తా. ప్రమోషన్ ఇస్తా అంటూ పరోక్షంగా మంత్రిని చేస్తానని ప్రకటించారు చంద్రబాబు. వర్మ సంబరపడ్డారు.
కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ పిఠాపురంలో పవన్ గెలవడంతో.. వర్మ పొలిటికల్ లైఫ్ డైలామాలో పడింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి అవుతున్నారు. ఆయనను నమ్ముకున్నవారు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అయ్యారు. కానీ పవన్ కోసం త్యాగం చేసిన వర్మ జీరో అయ్యారు.
ఇదిలా ఉంటే పిఠాపురం పరిధిలోని చిత్రాడ లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్లతో ఇక వర్మ రాజకీయ జీవితం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ గెలవడానికి రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయి. ఒకటి పవన్ ఇమేజ్. రెండోది పిఠాపురం ఓటర్లు. ఎవరైనా పవన్ కళ్యాణ్‌ను తాము గెలిపించాము అనుకుంటే వారి ఖర్మ అంటూ వర్మపై సెటైర్ వేశారు నాగబాబు. ఇది రాజకీయ సంచలనంగా మారింది. వర్మ అనుచరులు కుతకుతా ఉడికిపోతున్నారు. వర్మలో లోపల మధనపడుతున్నా బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆయనలో కూడా ఇక తనకు పదవి రాదు అన్న నమ్మకం ఏర్పడిపోయింది.
మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు మరో అధికార కేంద్రం రాదు.. రానీయరనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ అవసరం చంద్రబాబుకి ఎంతో ఉంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి ఏర్పడడానికి, చంద్రబాబు సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ కారణమన్నారు. అంతేకాదు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని నిలబెట్టి అధికారంలోకి తెచ్చానని ప్రకటించారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు జనసేనతో వివాదానికి వెళ్లరు. వర్మకు పదవి ఇస్తే ఆయన కచ్చితంగా దూసుకుపోతారు.
ఇది పవన్‌కు తల బొప్పికట్టిస్తోంది. దీంతో ఇక రాజకీయంలో వర్మ ఖర్మ అంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశంలో ఉన్నంతసేపు ఆయనకి పదవిరాదు. జనసేనలోకి వెళ్లినా చేసేదేమీ ఉండదు. ఇక ఆయన ముందు కనిపిస్తున్నవి మూడు మార్గాలు. ఒకటి రాజకీయానికి దూరం కావడం. రెండు బీజేపీలో చేరడం లేదా వైసీపీ వైపు చూడడం అంటున్నారు ఆయనను నమ్ముకున్నవారు. ఆయన ఏం చేస్తారు. వేచి చూడాల్సిందే.
Also Read: Ar Rahman: ఏఆర్ రెహమాన్ ఇప్పటికి నా భర్తే.. ఎమోషనల్ అయిన సైరా భాను.. స్టోరీ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









