ఇసి అభ్యంతరంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

ఇసి అభ్యంతరంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

Last Updated : Apr 14, 2019, 08:18 PM IST
ఇసి అభ్యంతరంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

అమరావతి: ఏప్రిల్ 11న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడం, పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వంటివి ఎన్నికలను సజావుగా సాగనివ్వలేదని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం తన పార్టీ నేతలతో ఓ బృందంగా వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆయన తనతోపాటు తీసుకొచ్చిన బృందంలో ఇప్పటికే ఈవీఎం చోరి కేసులో నిందితుడిగా వున్న వ్యక్తి హరి పి వేమూరు ఉండటంపై అభ్యంతరాలు చెప్పింది. ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వస్తూ.. ఈవీఎం చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని వెంటపెట్టుకుని వస్తారా అని కేంద్ర ఎన్నికల సంఘం టీడీపి అధినేత చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తంచేసింది.

 

ఈవీఎం చోరి కేసులో నిందితుడిగా వున్న హరి పి వేమూరు తమ బృందంలో ఉండటాన్ని ఎన్నికల సంఘం తప్పుపట్టడంపై టీడిపి అధినేత చంద్రబాబు స్పందించారు. తాము తమకు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా వెళ్లి ఇసిని కలిస్తే, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించకుండా పాత విషయాలను ప్రస్తావించడం ఏంటని చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. కేవలం ప్రస్తుత పరిస్థితి నుంచి తప్పించుకునేందుకే ఎన్నికల సంఘం ఈ వైఖరిని అవలంభిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

 

2010లో ఈవీఎం చోరీ కేసు విషయంలో టీడీపి నేత హరి పి వేమూరుపై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కారణంగానే కేంద్ర ఎన్నికల సంఘం హరి పి వేమూరు తమను కలిసేందుకు వచ్చిన బృందంలో ఉండటాన్ని ఇసి తప్పుపట్టింది.

Trending News