AP Politics: తెలుగుదేశం మహానాడు తర్వాత ఉమ్మడి కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ కాబోతోంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్‌లను మారుస్తున్నారన్న ప్రచారంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇంచార్జ్‌ను మార్పు చేస్తారన్న విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల కంటే ముందు ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునేందుకే భయపడే పరిస్థితి ఉండేది. అప్పటివరకు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి చుక్కలు చూపించారట. ఆ తర్వాత అక్రమ కేసుల్లో రెండుసార్లు జైలుకు వెళ్లడం, ఏకంగా నారా లోకేష్ కడప సబ్ జైలుకు వచ్చి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత మరింత పెరిగింది. దాంతో ప్రొద్దూటూరు ఎమ్మెల్యే టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డికే ఇస్తారని ప్రచారం జరిగింది.
కానీ ఎన్నికల సమయంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ టికెట్ నంద్యాల వరదరాజు రెడ్డికి దక్కింది. దాంతో నారజ్ అయినా ప్రవీణ్ కుమార్ రెడ్డి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నంద్యాల వరదరాజు రెడ్డి అధికారం చేపట్టి ఏడాది అయ్యింది. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడం లేదనే వాదన టీడీపీ క్యాడర్‌లో బలంగా ఉంది. అప్పట్లో వైసీపీ జెండా మోసిన వారినే ఎమ్మెల్యే వరద అక్కున చేర్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అక్కడ పదవులు అనుభవించిన వారికే తిరిగి పదవులు ఇప్పించారు అని పార్టీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. పార్టీ కోసం శ్రమించి, ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మున్సిపాలిటీలో కానీ మండలంలో కానీ పార్టీని నమ్ముకుని వచ్చిన ఏ ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేవలం ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, ఆయన కుమారుడు అన్ని వ్యవహారాలు చూసుకుంటుండడం పై పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, భూదందాలు చేసి కోట్ల రూపాయలు గడించారని ఆరోపణలు ఉన్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నింటిపై విచారణ చేసి ఊచలు లెక్కపెట్టేలా చూస్తామని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఇప్పటివరకు ఒక్క ఆధారం సేకరించలేకపోవడానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందమేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధిష్టానం దృష్టికి నిఘా వర్గాలకు, పార్టీ నాయకులు కార్యకర్తల ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో గతంలో చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తి 2019 నుంచి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాపార లావాదేవీల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి అతనికే ప్రాధాన్యత ఇస్తూ జిల్లా ఆసుపత్రి కమిటీలో సభ్యునిగా కూడా పదవి కట్టబెట్టారనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇరు పక్షాల నేతల మధ్య మధ్యవర్తిత్వం ఇతనే చేస్తున్నాడు అన్నది కూడా బహిరంగ రహస్యమే అంటున్నారు నియోజకవర్గంలోనీ తెలుగు తమ్ముళ్లు.
ఇటీవల మైనారిటీలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవిని కట్టబెట్టిన వ్యక్తికి వైసీపీలోనూ ఇదే పదవి ఉండేదట. దీంతో పార్టీని నమ్ముకొని ఉన్న మైనారిటీ వర్గాలు ఈ విషయంలో వరదరాజు రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. ఇలా ఒకటేమిటి వరదరాజులు రెడ్డి వద్దకు వెళితే నీతి, నిజాయితీ అంటారని, లో లోపల పార్టీ వ్యతిరేకులుగా ఉన్న వారికే పదవులు కట్ట పెడుతున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇలా అధికారం వచ్చి ఏడాది పూర్తి అయినా.. ఇప్పటివరకు ఒక్క భూమి పూజ చేయడం కానీ , పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఒక్క మంచి చేయడం కానీ చేయలేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెదవి విరుస్తున్నారట. ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు వచ్చారు. తిరిగి వారంతా వైసీపీలోకి మళ్లీ వెళ్లిపోయారు.
అటు గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి హంగామా చేశారట. చివరకు వార్డు సభ్యులను కూడా నిలబెట్టుకోపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉపసర్పంచ్ ను కైవసం చేసుకోలేకపోవడానికి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి వ్యవహార శైలి కారణమని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కడప జిల్లాలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి మాజీ టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. దాంతో ఆయన దాదాపు 500 వాహనాల్లో జన సమీకరణ చేశారట. ప్రస్తుతం నారా లోకేష్ ఆశీర్వాదం మెండుగ ఉండటంతో.. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి ఇద్దరు గన్‌మెన్లను కేటాయించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా ప్రవీణ్ కుమార్ రెడ్డికి పార్టీ హైకమాండ్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం.. ఎమ్మెల్యే వరద రాజులు రెడ్డికి మింగుడు పడని వ్యవహరంగా మారింది. ఇప్పటికే చాలా మంది నేతలకు ఫోన్లు చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి గన్‌మెన్లను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారట.. ఈ విషయంలో ఎవరూ వరదరాజు రెడ్డికి సహకరించకపోవడం, అధిష్టాన నిర్ణయాన్ని తామేల ఆక్షేపిస్తామని చెప్పారట. మరోవైపు మంత్రి నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కూడా వరదరాజుల రెడ్డికి దొరకలేదని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్‌ను మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికలలోపు ఇంచార్జ్‌ను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరి అధిష్టానం తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే..









