)
AP Politics: సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ఫైర్ బ్రాండ్ లీడర్.. సినీనటుడుగా కొనసాగుతూనే హిందూపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన. హిందూపురం అభివృద్దిలో ఆయన తనదైన మార్క్ చూపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ సైతం పెరుగుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగితే.. బాలయ్యకు తప్పక మంత్రి పదవి వస్తుందనే చర్చ సైతం లేకపోలేదు. అలాంటిది ఇప్పుడు టీడీపీలో బాలయ్య ఒంటరయ్యారనే చర్చ జరుగుతోంది. బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేసినా.. అధికార పార్టీలో ఏ ఒక్క నేత స్పందించక పోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోరు పారేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ ను సైకో అంని సంబోధించారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీనటులను జగన్ అవమానించారని మండిపడ్డారు. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని విమర్శించారు. ఈ కామెంట్స్ మొత్తం సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. అయితే బాలయ్య కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. బాలయ్య కామెంట్స్ సత్యదూరమంటూ ఖండించారు. అప్పట్లో జగన్ తమను అవమానించలేదని చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య కామెంట్స్ కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అవుతారని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు పవన్ స్పందించలేదు.. అటు సీఎం చంద్రబాబు సైతం బాలయ్య కామెంట్స్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
తాజాగా బాలయ్య సైకో కామెంట్స్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన వాళ్లను లోపలకు ఎలా అనుమతించారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటని జగన్ ఫైర్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ తాగొచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనన్నారు. తాగిన వాళ్లను స్పీకర్ ఎలా అసెంబ్లీలోకి అనుమతించారని జగన్ నిలదీశారు. అయితే వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ పై బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కామెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.. కానీ ఇప్పటివరకు టీడీపీ మంత్రులు, ఇతర నేతలు జగన్ కామెంట్స్‌పై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది..
నిజానికి నందమూరి బాలకృష్ణ సీఎం చంద్రబాబుకు స్వయనా బావమరిది. మంత్రి లోకేష్ కు మేనమామ, సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు. అలాంటి నేతకు టీడీపీ నేతలు అండగా నిలవడం లేదా అనే చర్చ జరుగుతోంది. ఇన్ని ట్యాగులు ఉన్న బాలయ్యకు అండగా నిలబడేందుకు టీడీపీలో ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంపై నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. టీడీపీలోనూ అదే చర్చ జరుగుతోంది. మొత్తంమీద నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం ఇంతలా కష్టపడుతున్నప్పటికీ ఆయనను విమర్శించినా ఏ ఒక్కరూ రియాక్ట్ కాకపోవడం వెనక బలమైన కారణం ఉండి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే సీఎం చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు..