
Telugu States Irrigation Projects Water Levels: బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ లు నిండు కుండలను తలపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురిస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీ వరద దృష్ట్యా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి 2లక్షల 41వేల 345 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తోంది. జూరాల 32 గేట్లు ఎత్తి శ్రీశైలం జలశయానికి నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3లక్షల 38వేల 218 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 4లక్షల 158 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35వేల 315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30వేల 153 క్యూసెక్కులు, 10 స్పిల్ వే గేట్ల ద్వారా 3లక్షల 4వేల 690 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 881.70 అడుగుల నీటి మట్టం ఉంది.
నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తడంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 3.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయ్యే అవకాశం ఉంది. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొంది.
అటు గోదావరి పరివాహాక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతుంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద 10.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. డెల్టా కాల్వలకు 2వేల 100 క్యూసెక్కులు, సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరిగింది. ప్రస్తుతం బ్యారేజ్ 175 గేట్ల నుంచి 8 లక్షల 23 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద 10 లక్షల క్యూసెక్కులు దాటితే ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాజమండ్రి వద్ద గోదావరి లంకల్లో నివసించే వారిని రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి నదికి వరద నీరు పోటెత్తింది. నీటిమట్టం 33 అడుగులు దాటింది. ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా సోకిలేరు, అన్నవరం, చీకటి వాగులు పొంగి చింతూరు, విఆర్ పురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రయాణికులకు అధికారులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.