‘తితలీ’ ఎఫెక్ట్: ఉత్తరాంధ్రకు భారీ నష్టం, ఇద్దరు మృతి

                     

Updated: Oct 12, 2018, 12:00 PM IST
‘తితలీ’ ఎఫెక్ట్: ఉత్తరాంధ్రకు భారీ నష్టం, ఇద్దరు మృతి

విశాఖపట్నం: తీరం దాటిన 'తితలీ' తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీయడంతో చాలా ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, రైల్వేలైన్లకు విఘాతం కలుగుతోంది. నష్టం ఎంత వరకు ఉంటుందనే దానిపై అధికారులు అంచవేయలేకపోతున్నారు.  కాగా తుఫాను ధాటికి చెట్టువిరిగి పడటంతో శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఆరు గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇదిలా ఉండగా తుఫాను నేపథ్యంలో కళింగపట్నంలో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొవద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

 ఈ రోజు తెల్లవారుఝామున శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తితలీ తుఫాను తీరం దాటిన విషయ తెలిసిందే. తీరం దాటే సమయానికి  పెనుతుఫానుగా మారి ఇలా తీవ్ర నష్టాన్ని కల్గిస్తోంది.