Tirumala Srivari pushkarini reopened for devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరోసారి శుభవార్త చెప్పింది. దాదాపు నెల రోజులుగా స్వామివారి పుష్కరిణిని మరమ్మత్తుల నేపథ్యంలో తాత్కలికంగా మూసి వేశారు. ఈ క్రమంలో మరమ్మత్తులు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో భక్తుల్ని పుష్కరిణిలోకి టీటీడీ అనుమతిస్తుంది.
సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో టీటీడీ సైతం తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది.
టీటీడీ జులై 20న పుష్కరిణి ఈ మరమ్మతు పనులు ప్రారంభించింది. పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని మొదలైన వ్యర్థాల్ని తొలగించారు. అంతే కాకుండా పుష్కరిణి మెట్లకు, చుట్టుపక్కల అందంగా పెయింటింగ్ కూడా వేసి అందంగా తీర్చి దిద్దారు. అన్ని పనులు పూర్తి కావడంతో తిరుమల పుష్కరిణిలోకి మరల భక్తుల్ని అనుమతిస్తున్నారు.
ముఖ్యంగా స్వామి వారి పుష్కరిణిలో.. బ్రహ్మోత్సవాల సమయంలో చక్రస్నానం,ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణిలో అభిషేకం,మంగళ స్నానాదులు నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలో స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేస్తే తెలిసి, తెలియక చేసిన పాపాలు, సకల దోషాలు పోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
అందుకే తిరుమలకు వచ్చిన వారంతా తప్పకుండా పుష్కరిణిలో స్నానంచేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. ప్రస్తుతం తిరుమల పుష్కరిణికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు గోవిందా.. గోవిందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.









