Virat Kohli In Simhachalam: టీమ్ఇండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు వైజాగ్ పర్యటనలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భాగంగా చివరి వన్డేను వైజాగ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు టీమ్ఇండియా జట్టు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు వైజాగ్ లోని సింహాచలం గుడిని విరాట్ కోహ్లీ సందర్శించారు.
విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ ప్రత్యేక పూజలు చేశారు. కోహ్లీతో పాటు వాషింగ్టన్ సుందర్, టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన కొందరు వ్యక్తులు ఈ గుడిని సందర్శించారు. కోహ్లీ రాకతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. సాధారణ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన కోహ్లీని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కోహ్లీ రాక తెలిసిన సింహాచలం ఆలయ అధికారులు, గుడి అర్చకులు కోహ్లీకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో వరాహ స్వామి దర్శనం చేసుకున్న కోహ్లీ.. ప్రత్యేక పూజలు చేయించారు. వెంటనే వేదశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
సింహాచలానికి విరాట్ కోహ్లీ వచ్చాడన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు గుడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు యువత ఎంతో ఉత్సాహాంగా ఆలయానికి చేరుకున్నారు. ఆయన్ని చూడటమే కాకుండా ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో పోలీసులు విరాట్ కోహ్లీ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ చూసిన విరాట్ కోహ్లీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్ కోహ్లీ మరోసారి మైదానంలో తన మ్యాజిక్ చూపాడు. తొలుత బ్యాటింగ్ కు వచ్చిన యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగి.. కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌తో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ అపూర్వ విజయంతో సౌతాఫ్రికాపై 2-1 తేడాతో టీమ్ఇండియా సిరీస్‌ను గెలుపొందింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









