Kumki Elephant Details in Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుంకీ ఏనుగులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందజేశారు. కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్స్‌లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధివిధానాల పత్రాలను కూడా పవన్ కళ్యాణ్ అందుకున్నారు. శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా.. పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగుల సంరక్షణపై కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు ఏపీ మావటీలకు శిక్షణ ఇవ్వనున్నారు.
కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి..?
అడవి ఏనుగులను పట్టుకోవడానికి ఎంతో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న ఏనుగులు కుంకీలు అని పిలుస్తారు. కర్ణాటకలోని దుబరే, సక్రేబైలు ఏనుగు శిబిరాల్లో వీటికి శిక్షణ ఇస్తారు. అనేక ప్రాంతాల్లో అడవి ఏనుగుల నియంత్రణకు, వాటిని పట్టుకోవడానికి శిక్షణ పొందిన కుంకీలను ఉపయోగిస్తున్నారు. ఒక ఏనుగు కుంకీగా మారేందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది. కుంకీలుగా మార్చేందుకు మగ ఏనుగులనే ఎంపిక చేస్తారు. ఎంపిక చేసుకున్న తరువాత అడవి ఏనుగులను ఎలా తరిమి వేయాలో పూర్తిగా శిక్షణ ఇస్తారు. అడవి ఏనుగులను మచ్చిక చేసుకునే విధానం.. ఆగ్రహంతో ఉన్న ఏనుగులను ఎలా అడవిలోకి పంపిచాలో ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాకుండా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. వాటిని తరిమికొట్టడంలో కుంకీ ఏనుగులు దిట్ట. మావటి ఇచ్చే ఆదేశాలను కుంకీలు కచ్చితంగా పాటిస్తాయి. మనుషులతో సన్నిహితంగా ఉంటూ.. ఇతర ఏనుగులతోనూ సామరస్యంగా మెలుగుతాయి. ఏనుగుల గుంపును అడివిలోకి తరిమేసే వరకు వదిలిపెట్టవు. అందుకే కుంకీలకు భారీ డిమాండ్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో గజరాజుల సంచారం ఎక్కువగా ఉంటుంది. తిరుపతి, చిత్తూరు వంటి జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపు దాడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. పంటలకు నష్టం కూడా వాటిల్లుతోంది. 20 ఏళ్లుగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెక్ పెట్టనున్నారు. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చలు జరిపి.. ఏపీకి తీసుకువచ్చారు.
Also Read: BCCI vs Franchisees: బీసీసీఐ కొత్త నిబంధనలపై ఫ్రాంచైజీల ఆగ్రహం, ఎందుకంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook