
Sri Rama Navami 2025: సంక్షేమ రాజ్యం.. గొప్ప ఆదర్శవంతమైన జీవితం.. లోకాభిరాముడు కల్యాణమాడిన శుభ ఘడియన చేసుకునే శ్రీరామనవమి వేడులకు సంబంధించి ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు చేశారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని అభిలషించారు. అయితే పండుగ శుభాకాంక్షల్లోనూ పవన్ కల్యాణ్ రాజకీయ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ప్రజలకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. '‘రామో విగ్రహవాన్ ధర్మః’.. సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించితే అది సాక్షాత్ రాముడి రూపమే అవుతుంది. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు మూర్తి శ్రీరాముడు. తిరుగులేని పరాక్రమశీలి అని శ్రీమద్వాల్మీకి రామాయణం చెబుతోంది. సత్యం, ధర్మం, న్యాయం అనేవాటిని ఒక పాలకుడు ఎంత నిబద్ధతతో పాటించాలో శ్రీరామచంద్రుడి నుంచి పాలకులు గ్రహించాలి. దశరథ తనయుడు ధర్మానికి ప్రతీక కాబట్టే... త్రేతా యుగం నుంచి నేటి కలియుగంలోనూ రామ నామం వాడవాడలా మారుమోగుతూ ఉంది' అని పవన్ కల్యాణ్ తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా హైందవ ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ భక్తిపూర్వక శుభాకాంక్షలు అని ప్రకటించారు. ఏ గొప్ప గుణం గురించి చెప్పాలన్నా.. శ్రీరాముడినే ప్రతిరూపంగా చూపిస్తుంది మన భారతీయ సమాజం అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. 'అంతటి శ్రీరాముడి విగ్రహానికి గత పాలకుల హయాంలో శిరచ్ఛేదం జరిగింది' అని గుర్తుచేశారు. ఆ దుష్ట పాలనకు ప్రజలు ఎంతో ధర్మబద్ధంగా చరమగీతం పాడారని ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వాల్మీకి మహర్షి చెప్పిన రామ రాజ్య పాలన ఆవిష్కృతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పడం ఒక బాధ్యతగా భావిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
సకల శుభాలు కలగాలి
'శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి. ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని.. సీతారాముల కల్యాణాన్ని వేడుకగా చేసుకోవాలి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభిలషించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe