)
Montha Cyclone: మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను చంద్రబాబు ఎగ్గొట్టారని.. అతడి తప్పిదంతో పంటలకు పరిహారం రావడం లేదని విమర్శించారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో రైతులకు నష్టం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి చంద్రబాబు ఆదుకోవాలని కోరారు.
కృష్ణా జిల్లాలో మొంథా తుఫాన్‌తో నష్టపోయిన పంట పొలాలను పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. పంట పొలాల్లోకి వెళ్లి రైతులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. 'రబీ నుంచి ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా రూ.600 కోట్లు బకాయి ఉన్నాయి. ఆ మొత్తం కూడా వెంటనే ఇవ్వాలి' అని చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. 'రైతుల కష్టనష్టాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడతాం. రైతుల పక్షాన నిలుస్తాం. వారికి తోడుగా ఉంటాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.
'వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు అండగా ప్రభుత్వం ఉంది. ప్రతి రైతులో ఒక భరోసా ఉండేది. జగన్ ఉన్నాడన్న నమ్మకం. పంటలకు పెట్టుబడి సాయం మొదలు ప్రతి అడుగులో తోడుగా యేటా కచ్చితంగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. 'ప్రతి ఎకరా పక్కాగా ఈ–క్రాపింగ్. ఉచిత పంటల బీమా అమలు చేశాం' అని తెలిపారు. నాడు వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు మేలు చేసిన పథకాలు, కార్యక్రమాలన్నీ కనుమరుగయ్యాయని మాజీ సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు.
'ఇప్పుడు తూతూ మంత్రంగా ఈ–క్రాప్ నమోదు. టీడీపీ రైతులకు మేలు చేసేలా తప్పుడు వివరాలు. వాస్తవ భూమి, పంటల సాగుకు మించి ఈ–క్రాప్ నమోదు. ఒక్క జిల్లాలోనే ఏకంగా 128 శాతం వరకు నమోదు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా?' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఒక్క రోజులో పంట నష్టం ఎలా సాధ్యమని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకు దగా చేశారని చంద్రబాబు తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి