)
Amaravati Land Pooling: రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందని.. రియల్ ఎస్టేట్ మాఫియా పెట్రేగిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క కిలోమీటర్ అభివృద్ధి చేయలేదు కానీ వేల ఎకరాలు సేకరించడం ఎందుకు? అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ కావాలా? అంతర్జాతీయ రాజధాని కావాలా? అని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాజధాని అమరావతికి మలి విడత భూ సేకరణ చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏపీ రాజధాని అమరావతి లో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూఠీ జరుగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ భూమితో కలిపి 54 వేల ఎకరాలు సేకరించారు. 11 ఏళ్ల తరువాత కూడా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. ఒక్క కిలోమీటర్లో కూడా అభివృద్ధి అనేది లేదు' అని షర్మిల తెలిపారు.
'54 వేల ఎకరాల్లో అభివృద్ధి జరిగిపోయినట్లు చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు. ఇంకా అక్కడ భూమి లేనట్లుగా అదనంగా 44 వేల ఎకరాలు సేకరణకు సిద్దమయ్యారు. మున్సిపాలిటీ కావాలా, అంతర్జాతీయ రాజధాని కావాలా అని చంద్రబాబు అడుగుతున్నారు' అని వైఎస్ షర్మిల తెలిపారు. రాజధానిగా ప్రకటించిన సమయంలో 54 వేల ఎకరాల్లో సింగపూర్, న్యూఢిల్లీ తలపించే రాజధాని అని మీరు చెప్పలేదా? అని ప్రశ్నించారు. గ్లోబల్ సిటీగా అన్ని రంగాలను ఇక్కడకు తెస్తామని చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు.
'54 వేల ఎకరాల్లో మున్సిపాలిటీ అని ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? 34 వేల ఎకరాలను ఇచ్చిన రైతులను వెన్నుపోటు పొడవటం కాదా? చంద్రబాబు రైతులకు సమాధానం చెప్పాలి' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన 54 వేల ఎకరాల భూమి ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రి నారాయణ 700 వందల ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని చెబుతుంటే.. అసలు ఎంతెంత ఎవరికి కేటాయించారు? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు విభజించి ఇచ్చారా? అని నిలదీశారు.
రాజధానికి సంబంధించిన 54 వేల ఎకరాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఉన్న భూమిలో పనులు పూర్తి చేసినట్లుగా అదనంగా భూమిని అడగటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మింగడానికి మెతుకు లేదు గానీ... ఇన్ని వేల కోట్లు అవసరమా? అని షర్మిల ప్రశ్నించారు. పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ నిధులు మాత్రం ఇవ్వరని మండిపడ్డారు. అమరావతిపై చంద్రబాబుకే చిత్తశుద్ధి లేకపోతే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? అని సందేహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన వాళ్లకి న్యాయం చేయకపోగా.. కొత్తగా మళ్లీ రైతులను బాధితులుగా మారుస్తారా? అని చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook