)
Tribal Deaths In Agency: ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు వరుసగా మృతి చెందుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మన్యంలో వరస మరణాలు తీవ్ర ఆందోళనకరమని.. ఇది మన్యంలో జరుగుతున్న మరణ మృదంగమేనని తెలిపారు. కురుపాం ఘటన తర్వాతైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం సిగ్గుచేటు అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. ముక్కు పచ్చలారని బిడ్డలను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా హడ్డుబంగి పాఠశాల విద్యార్థిని మృతి కూటమి చంద్రబాబు, పవన్ చేసిన వరుస హత్యనే అని ప్రకటించారు. బిడ్డ బంగారు భవిష్యత్‌ను చిదిమేశారని.. గురుకులాల్లో పిల్లల జీవితాలను గాల్లో దీపాలుగా మార్చారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న మరణాలపై 'ఎక్స్' వేదికగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఏజెన్సీ ఆశ్రమాల్లో గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకొనే దిక్కులేదని విమర్శించారు. చంద్రబాబు 16 నెలల పాలనలో 21 మంది బిడ్డలు చనిపోయారంటే వారి మృతదేహాలపై పాలన సాగుతున్నట్లు లెక్క అని దుయ్యబట్టారు. వరుస మరణాలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ప్రకటించారు. గిరిజన సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుందని ఎద్దేవా చేశారు.
'వసతి గృహాల్లో గిరిశిఖర బిడ్డలకు ఏది పెట్టినా అడగరని ప్రభుత్వానికి అలుసు. ఒక్క రూంలో 100 మందిని కుక్కినా నోరు మెదపరని ధీమా. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం. పేరు గొప్ప.. ఊరు దిబ్బ' అని చంద్రబాబు పాలనను వైఎస్ షర్మిల దెప్పిపొడిచారు. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు లోగిళ్ళు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కరువు అని ఆవేదన వ్యక్తం చేశారు. 'పారిశుద్ధ్యం మీద పట్టింపు లేదు. అసలు బిడ్డలు ఏం తింటున్నారో? ఎలా ఉంటున్నారో చూసే వ్యవస్థే శూన్యం. ఎస్సీ హాస్టళ్లలో 228 మంది ఆడబిడ్డలకు ఒకటే బాత్రూమ్ ఉందని కోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు ' అని చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూచించారు. ఇప్పటిదాకా 21 మంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నందుకు ఆ కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్ర 2047 కాదు.. స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 కావాలి. ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలు పెట్టకపోవడం శోచనీయం' అని పేర్కొన్నారు. వెంటనే స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 మిషన్‌కు శ్రీకారం చుట్టాలని.. సంక్షేమ బడుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి