)
YS Sharmila On CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. దళితవాడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో గుడులు నిర్మించాలన్న ఆయన నిర్ణయంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం చంద్రబాబు RSS సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని రుజువు చేస్తుందని ఆమె అన్నారు.
దళితవాడల్లో గుడులు ఎవరి కోసం?
షర్మిల మాట్లాడుతూ, "టీటీడీ అత్యంత పవిత్రమైన దేవాలయం. అందులో సందేహం లేదు. కానీ, దళితుల వాడల్లో గుడులు కట్టమని ఎవరు అడిగారు? టీటీడీ ఖజానాలో ఎక్కువ డబ్బు ఉంటే.. ఆ నిధులతో దళితవాడల్లో ఇతర మౌలిక వసతులు కల్పించాలి. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 200 మంది విద్యార్థినులకు ఒకటే బాత్రూమ్ ఉందట. ఆ డబ్బుతో ఆ బిడ్డలకు కనీస వసతులు కల్పించండి. 5 వేల గుడులు కడితే దళితులనే పూజారులుగా పెడతారా?" అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు దళితులపై శ్రద్ధ ఉంటే, వారి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
బీజేపీపై దేశవ్యాప్త ఉద్యమం
దేశంలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. బీజేపీ గెలుపు కష్టం అనుకున్న చోట దొంగ ఓట్లను చేరుస్తున్నారని, బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఆమె అన్నారు. "రాజ్యాంగం మనకు ఇచ్చింది ఓటు హక్కు. అందరినీ సమానంగా చూసేది ఓటు మాత్రమే. అలాంటి ఓటు వ్యవస్థను బీజేపీ కలుషితం చేసింది. అందుకే బీజేపీ మీద దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాం. అన్ని రాష్ట్రాల్లో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది" అని ఆమె తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడానికి చంద్రబాబు కూడా ఒక కారణమని, మిత్ర ధర్మం ముసుగులో ఆయన పూర్తిగా RSS లో కలిసిపోయారని షర్మిల అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఇది తేటతెల్లమైందని ఆమె చెప్పారు.
ముఖ్య ఆరోపణలు
చంద్రబాబు RSS మనిషిలా మారారని, బీజేపీ సిద్ధాంతాలను నెత్తిన ఎత్తుకున్నారని షర్మిల అన్నారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ అని, మతం పేరిట మాటలు రాజేసి అందులో చలి కాచుకునే పార్టీ అని ఆమె విమర్శించారు. మరోవైపు ఎన్నికల సంఘం సైతం బీజేపీ గుప్పిట్లో ఉందని, బీజేపీ తొత్తుగా మారిందని ఆమె ఆరోపించారు. మహాదేవపుర, అలంద్ నియోజకవర్గాల్లో వేల ఓట్లను తొలగించారని, మహారాష్ట్ర ఎన్నికలకు 5 నెలల ముందు 60 లక్షల కొత్త ఓట్లు చేర్చారని ఆమె అన్నారు.
RSS రాజ్యాంగంలో హిందువులు మాత్రమే మనుషులని, మిగతా మతస్తులు అంతా పురుగులుగా చూస్తారని షర్మిల పేర్కొన్నారు. దళిత వాడల్లో గుడులు కట్టే నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దళితవాడల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook