Capital Amaravati: 'ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు చంద్రబాబు తీరు ఉంది. రాజధాని అమరావతిపై మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. లేనిది ఉన్నట్లు నమ్మిస్తున్నారు' అని సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంపై శ్రద్ధ పెట్టలేదని.. చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. రాజధాని నిర్మించకుండా డిజైన్లు, ఫొటోలతో కాలం గడపడాన్ని తప్పుబట్టారు.
Also Read: Tomorrow Holiday: రేపు జాతీయ సెలవు! అన్నీ స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లు, బ్యాంకులు బంద్
అమరావతి రాజధాని నిర్మాణంపై 'ఎక్స్' వేదికగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'రాజధాని అమరావతి పేరుతో సేకరించిన రూ.34 వేల ఎకరాల్లో అభివృద్ధికి దిక్కులేదు. పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అత్యవసరంగా అవసరం వచ్చిందట. అందులో అద్భుత ప్రపంచం కడతాడట' అని ఎద్దేవా చేశారు. 'అరచేతిలో వైకుంఠం చూపించడం.. ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం.. లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుకే తెలిసిన విద్య' అని ఎద్దేవా చేశారు.
'రాజధాని విస్తరణ పేరుతో.. విలువైన రైతుల భూములను మళ్లీ అగ్గువకే కాజేసి.. తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్పా మరోటి కాదు' అని వైఎస్ షర్మిల ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదని షర్మిల స్పష్టం చేశారు.
Also Read: Snakes Dance: బుసలు కొడుతూ పాముల సయ్యాట.. బెంబేలెత్తిన ప్రయాణికులు
'రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదు. అఖండ అమరావతికి మోకాలడ్డు మా ఉద్దేశం అంతకన్నా కాదు. కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ?' అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు.. ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం? అని షర్మిల నిలదీశారు. 'సింగపూర్ తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ? రాజధానిని ముందు నిలబెట్టకుండా.. ఒక రూపం అంటూ తీసుకురాకుండా.. చిత్రాలతో విచిత్రాలు చేస్తూ.. ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా?' అని చంద్రబాబుపై షర్మిల ప్రశ్నలు సంధించారు.
'ఫేజ్ 1లో సేకరించిన 34 వేల ఎకరాల్లో రెండు వేల ఎకరాలు మిగలడం ఏంటి? సీడ్ క్యాపిటల్‌కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు? ఏ సంస్థలకు కేటాయించారు? ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు?' అని చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ షర్మిల కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









