RTC Free Bus Scheme: అధికారం కోసం ఎన్నికల్లో మహాశక్తి పేరిట ప్రకటించిన ప్రత్యేక మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని అసెంబ్లీలో మంత్రి సంధ్యారాణి చేసిన ప్రకటన రుజువు చేస్తోంది. ఎన్నికల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు హామీ ఇచ్చిన ప్రభుత్వం మంత్రి ప్రకటనతో యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీలపై మండిపడ్డారు.
Also Read: Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్ కల్యాణ్ 'ఒక్క దెబ్బకు రెండు పిట్టలు'
ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉంది అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణంగా అభివర్ణించారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసంగా పేర్కొన్నారు. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు ఇవి అని తప్పుబట్టారు. 'ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి' అని షర్మిల మండిపడ్డారు.
Also Read: Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చేసరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో' అని వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం కల్పించినట్టు ఏపీలో కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు.
'ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసీకి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు' అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై షర్మిల మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా? అని ప్రశ్నించారు. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత? అని నిలదీశారు. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









