)
YS Sharmila vs Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరతతో రైతులు కష్టాలు ఎదుర్కొంటుండగా.. కనీస ధర లేక ఉల్లి, మిర్చి రైతులు ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇంటి ముట్టడికి బయల్దేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై.. చంద్రబాబు పాలనపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల యూరియా కొరతపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు.
క్యాన్సర్లకు కారణం రైతులు వాడే యూరియా అయితే.. మరి కూటమి ప్రభుత్వం విక్రయించే లిక్కర్‌తో అదే క్యాన్సర్ రాదా అని చంద్రబాబును వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'రాష్ట్రంలో రైతుల పరిస్థితి వర్ణనాతీతం. వ్యవసాయానికి సాయం లేదు. అన్ని రాయితీ పథకాలు ఎత్తివేశారు. రైతు మరణాల్లో రాష్ట్రం మూడో స్థానం. రైతుకు రాష్ట్రంలో భరోసా లేదు. పండిన పంటకు గిట్టుబాటు లేదు. ధర లేక రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది' అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆరుగాలం రైతు పండించిన టమాటాకు ధర కిలో రెండు రూపాయలు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పోసి పండించిన ఉల్లి ధర క్వింటాకి రూ.50. మిర్చికి రూ.12 వేలు ఇస్తామని రూ.6 వేలు కూడా ఇవ్వలేదు. జొన్నలకు 3300 కనీస ధర ఉంటే రూ.2 వేలు కూడా దక్కలేదు. పొగాకు రైతులకు రూ.18 వేలు దక్కాల్సిన చోట రూ.3 వేలు కూడా ఇవ్వలేక పోయారు. అరటి రైతులకు రూ.30వేలు ఇవ్వాల్సి ఉండగా టన్నుకు రూ.15 వేలు కూడా పలకలేదు' అని వైఎస్ షర్మిల వివరించారు. పెసర, మినుము, వేరుసెనగ ఇలా ఏ పంటకు గిట్టుబాటు లేదని.. పత్తి పంట రైతుల తిత్తి తీసిందని చంద్రబాబు ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి రైతులకు 12 వందలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. టమాటా రైతులకు ధర తగ్గితే రూ.8 ఇస్తామని.. ఇప్పుడు మార్కెట్ కిలో ధర రూ.2 ఇస్తుంటే చోద్యం చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై షర్మిల ధ్వజమెత్తారు.
'రైతుల సమస్యలను వినతిపత్రం ద్వారా సీఎం చంద్రబాబును కలిసి విన్నవించాలని ప్రయత్నించాం. కానీ పోలీసులు అడ్డుకోవడం అన్యాయం' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 'రాష్ట్రంలో రైతులకు యూరియా ఎక్కడ లేదు. యూరియా అడిగితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇదేనా రైతులపై ప్రభుత్వ బాధ్యత' అని చంద్రబాబును ప్రశ్నించారు. 'మీరు సరఫరా చేసే లిక్కర్‌తో క్యాన్సర్ రాదా?' అని నిలదీశారు. ఇంకా లక్ష టన్నుల యూరియా రాష్ట్రానికి రావాలని గుర్తుచేశారు. వచ్చిన యూరియా ఎక్కడ పోయిందో తెలియదని.. యూరియా మీద కనీసం మోడిని నిలదీసే దమ్ము చంద్రబాబుకు లేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook