)
Onion Price Fall Down: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తగలకపోదు అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శాపనార్థం పెట్టారు. రైతుల ఇంట కన్నీళ్లు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ప్రకటించారు. ఉల్లి ఎండినా నష్టమే.. ఇప్పుడు పండినా నష్టమేనని తెలిపారు. ఎకరాకు రూ.1.20 లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తే.. మీరిచ్చే ధర కిలోకి 50 పైసలా? అని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు.
ఏపీలో ఉల్లి రైతుల ధర పతనంతో ఎదుర్కొంటున్న కష్టాలపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోపాటు కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'క్వింటాకు 50 రూపాయలా? ఆరుగాలం కష్టించి ఉల్లి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3 వేలు మాత్రమే. ఉల్లి వేసిన కారణంగా ఒక్కో రైతుకి వచ్చిన నష్టం ఎకరాకు అక్షరాల రూ.లక్షా 15 వేలు' అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 'ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారే. అలాంటి ఉల్లి పండించే రైతే ఉరేసుకొనే పరిస్థితి వస్తే మీరేం చేస్తున్నారు?' అని చంద్రబాబును షర్మిల నిలదీశారు.
'రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా? ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుంది?' అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ధర లేక బేజారు అవుతుంటే ఉల్లి రైతు కళ్లల్లో ఆనందం ఎక్కడుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 'కర్నూల్ మార్కెట్లో దళారుల ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1,200 ఇస్తామని చెప్పి రైతులను ఉద్ధరించినట్లు గొప్పలకు పోయారు. ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారు. ఒక్క రైతుకైనా రూ.1200 గిట్టుబాటు ధర ఇచ్చారా? ఒక్క కిలో అయినా మార్క్ ఫెడ్ సేకరించిందా?' అని చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు.
'రైతులు తాము కష్టపడిన ఉల్లిని 50 పైసలకు అమ్ముకోలేక మార్కెట్లోనే వదిలేస్తుంటే, కూలీ ఖర్చుల మందం కూడా రాలేదని బోరున విలపిస్తుంటే ఎక్కడుంది రైతు కళ్లల్లో ఆనందం?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర వెయ్యికి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరాఘాతంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ డబ్బా కొట్టడం కాదని.. ఉల్లి రైతుల కష్టాల మీద చర్చ చేపట్టాలని సూచించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఇస్తామని చెప్పిన రూ.1,200 వెంటనే అందేలా చూడాలని వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. కర్నూల్ మార్కెట్లో దళారుల మాయాజాలాన్ని వెంటనే అరికట్టాలని చంద్రబాబును వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
కర్నూలు మార్కెట్‌కు వచ్చిన ఉల్లి రైతులతో షర్మిలమ్మ ముఖాముఖి ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, అరకొర దిగుబడి మార్కెట్‌కు తెస్తే క్వింటా రూ.250-600కు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన… pic.twitter.com/XNFLwi51Nw
— INC Andhra Pradesh (@INC_Andhra) September 9, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి