Re Launch Amaravati Development: మరోసారి అమరావతికి శంకుస్థాపన చేసేందుకు వస్తున్న ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చెంబేడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇదే అమరావతికి ప్రధాని మోదీ చేసిన సహాయం. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారు. ఇప్పుడు మళ్లీ సున్నం కొట్టడానికి వస్తున్నారు' అని విమర్శించారు. చివరికి ఆత్మగౌరవం అమరావతిని "మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ " కింద మార్చేశారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని ప్రకటించారు. 'రాష్ట్రానికి చేసింది ద్రోహం. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి.. రూ.15వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటు' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
Also Read: AP Government: కారు చౌక బేరం, 99 పైసలకే 21 ఎకరాలు ధారాదత్తం కేవలం బడాబాబులకు మాత్రమే
'అమరావతిపై మోడీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా? రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా? ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా? 3డీ గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా?' అని నేరుగా ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల ప్రశ్నలు సంధించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా? అని నిలదీశారు. 'ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు? అమరావతి రైతుల ఉద్యమం ఢిల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు? ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోయారా?' అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. పదేళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే.. ఇందుకు ప్రధాన ముద్దాయి ఏ1 మోడీ, ఏ2 చంద్రబాబు.. ఏ3 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
Also Read: Tirumala Drone: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్
వచ్చే నెల 2వ తేదీన అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీ తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. 'ఏపీ నూతన రాజధాని నిర్మాణం విభజన హామీలో ఒకటి. కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్ట్' అని షర్మిల గుర్తుచేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తి స్థాయి నిధులు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. 'వైజాగ్ స్టీల్ ప్లాంటు సెయిల్‌లో విలీనంతో పాటు, కడప స్టీల్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై మీ వైఖరి తేల్చాలి' అని షర్మిల విజ్ఞప్తి చేశారు. పోలవరం ఎత్తు 45 మీటర్లా? లేక 41 మీటర్లకే పరిమితమా? ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









