YS Viveka Murder Case: తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి అతడి సోదరి.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థలో తనపై దుష్ప్రచారం.. రాజకీయ వ్యవహారాలను తప్పుబడుతూ చేస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ప్రజలు కొట్టినట్లు తీర్పు ఇచ్చినా చీనపు చేష్టలు మారవా? అని మండిపడ్డారు. నిజాలు జీర్ణించుకోలేనివారు ఈ జన్మకు మారరని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.
Also Read: AP Aqua Industry: 'డొనల్డ్ ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్నాం.. కాపాడండి': సీఎం చంద్రబాబు లేఖ
తన రాజకీయాలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సోమవారం వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 'వైఎస్సార్‌సీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్లకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు' అని తెలిపారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఏది చేసినా అర్థం.. పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనమని కొట్టిపారేశారు.
Also Read: Thiruvuru: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై టీడీపీ లీడర్ల తిరుగుబాటు
'స్వయంశక్తితో ఎదుగుతుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే.. చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం' అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. '11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు.. ఇక ఈ జన్మకు మారరు అని ప్రజలకు మరోసారి అర్థమైంది' అని తెలిపారు.
'తండ్రి (వైఎస్సార్) ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ప్యాలెస్‌లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు' అని సోదరుడు వైఎస్ జగన్‌పై షర్మిల విమర్శలు చేశారు. 'ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారు' అని ఆరోపణలు చేశారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి ఐదేళ్ల పాటు మోదాని సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు.
'ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన కర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదు. పులి బిడ్డ పులిబిడ్డే' అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 'ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే! ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుంది' అని తెలిపారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. తాను చేస్తున్న పోరాటాలు కనపడకపోవడం చూస్తుంటే వాళ్లు గుడ్డివాళ్లు అనడానికి నిదర్శనమని వైఎస్ షర్మిల తెలిపారు.
'ప్రజల శ్రేయస్సే ముఖ్యమైతే అసెంబ్లీకి వెళ్లి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు?' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'నీచపు కుయుక్తులతో.. పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్పా ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు' అని విమర్శించారు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









