)
MLC Ananta Babu: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రూటు మార్చారు. ఎన్నికల సమయం తరహాలో అక్కడ టిడిపి ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతుల దోపిడీపై విమర్శలు చేస్తున్నారు. దీనికి టిడిపి ఎమ్మెల్యే సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో రచ్చ జరుగుతోంది. ఇటీవల వైసిపి అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ అనంత బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం నియోజకవర్గంలో దోచుకో... పంచుకో అనే స్థితిలో ఉన్నారనీ... రాష్ట్రంలోనే ఆమె కరప్షన్ లో నెంబర్ వన్ అంటూ ఫైర్ అయ్యారు. ఒక సర్పంచ్ కు ఉన్న ఆదరణ కూడా ఎమ్మెల్యేకు లేదనీ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల పై టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అయితే ఈ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుండగానే.. ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే దంపతులు నియోజకవర్గంలోని ప్రజలను పట్టి పీడిస్తున్నారనీ.. అడ్డతీగల మండలంలో జరుగుతున్న రంగు రాళ్ల తవ్వకాల్లో ఎమ్మెల్యే భర్తకు సంబంధాలు ఉన్నాయనీ విమర్శించారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతి బాగోతం పరాకాష్టకు చేరుకుందనీ.... ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారుల వద్ద తమ ఏజెంట్ల ద్వారా మామూళ్లు వసూలు చేస్తున్నారనీ తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ అనంత బాబు తోపాటు అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ ఎమ్మెల్యే పై దుమ్మెత్తి పోశారు. ఎమ్మెల్యే దంపతులు లక్షలు దోచుకుని వేలల్లో అంబులెన్స్ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారనీ అన్నారు. తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగత మాటలతోనే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తనను టార్గెట్ చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష సైతం ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. డోర్ డెలివరీ అనంతబాబుకు తమ పార్టీ కార్యకర్తలతో బుద్ధి చెబుతామని అన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ధనలక్ష్మిని డమ్మీ చేసి ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు చేశారనీ.. ఢిల్లీలో ఆస్తులు, చేపల చెరువులను సంపాదించారనీ విమర్శించారు. తాను ఊక లారీల్లో గంజాయి, రంగురాళ్లు, అక్రమ కలప వ్యాపారాలు చేయలేదని అన్నారు. ఇప్పటికే రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామనీ.. అసెంబ్లీలో మాట్లాడి పోలవరం నివాసితుల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే శిరీష చెబుతున్నారు.
కొద్దిరోజులుగా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇక 2014 నుంచి 2019 ఎన్నికల్లో అనంతబాబు బలం తోడవ్వడంతో మహిళా అభ్యర్థులైన వంతల రాజేశ్వరి, నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యేల గెలుపుకు దోహదపడింది. 2024 ఎన్నికల్లో టిడిపి టికెట్ ను అనూహ్యంగా దక్కించుకున్న అంగన్వాడి కార్యకర్తల మిరియాల శిరీష ఇక్కడ విజయం సాధించడంతో అనంతబాబుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త విజయ్ భాస్కర్ ల హవా కొనసాగుతోంది. డోర్ డెలివరీ కేసు.. పార్టీ అధికారంలో లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల అనంతబాబు కొత్త పంథాలో వెళ్తున్నారు.
వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలో లేక నియోజకవర్గంలో పట్టు కోసమో గానీ టీడీపీ ఎమ్మెల్యేపై దోపిడీ విమర్శలు మొదలు పెట్టారు. ఇకనైనా ఎమ్మెల్యే దంపతులు తీరు మార్చుకుని వారి గురించి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఆలోచించాలనీ సూచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ జరిగే దోపిడీ వ్యవహారాలు.. అసాంఘిక కార్యకలాపాలపై అనంతబాబు ఇలాగే రచ్చ చేస్తూ వెళతారా అనేది చూడాలి. ఏదీఏమైనా ఇప్పటికే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బహిరంగం అయ్యింది. గతంలో వైసిపి ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే మధ్య రగడలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి