
8th Pay Commission Latest Update: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త వినిపించబోతున్నారని రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా 8వ పే కమిషన్ ఏర్పాటు విషయంలో కేంద్రం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి జనవరి 2025లో కేంద్రం 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు చైర్మన్, సభ్యుల నియామకాలు జరగకపోవడంతో ఉద్యోగుల్లో ఒకింత అసహనం పెరుగుతోంది. తొమ్మిది నెలలు గడిచిపోయినా ప్రక్రియ ముందుకు సాగకపోవడం వల్ల, పెన్షనర్లతో పాటు ఉద్యోగ వర్గాల్లోనూ నిరాశ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం దసరా నాటికి ఈ నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా పే కమిషన్ సిఫార్సులు ప్రతి 10 ఏళ్లకోసారి అమల్లోకి వస్తాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే, 8వ పే కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కమిషన్ ఏర్పాటుకూడా పూర్తి కాలేదు. దీంతో సిఫార్సులు తయారు చేయడానికి, ఆమోదం పొందడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే, 2026 చివరి నాటికి గాని 8వ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రాకపోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి ఉద్యోగులు ఎక్కువగా పట్టుబడుతున్న అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. గత 7వ పే కమిషన్‌లో దీన్ని 2.57గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు కనీసం 2.86గా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
*ప్రస్తుతం కనిష్ట బేసిక్ వేతనం రూ. 18,000గా ఉంది.
*ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.28గా నిర్ణయిస్తే, బేసిక్ వేతనం రూ. 41,000కి పెరగవచ్చు.
*ఉద్యోగుల డిమాండ్ మేరకు 2.86 అమలైతే, కనిష్ట వేతనం రూ. 51,000 వరకు పెరగొచ్చని అంచనా.
ఈ పెరుగుదల ఉద్యోగుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఆర్థిక భారం కారణంగా ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశవ్యాప్తంగా సుమారు ఒక కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ పే కమిషన్ సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల వేతనాలకే కాకుండా, పెన్షన్ల రివిజన్, అలవెన్సులు, ప్రయాణ భత్యాలు వంటి అంశాలపై కూడా ఈ కమిషన్ సిఫార్సులు ప్రభావం చూపనున్నాయి. దీంతో పెన్షనర్లు కూడా దీనిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, దసరా నాటికి కేంద్రం చైర్మన్, సభ్యుల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే కమిషన్ పనులు వేగం పుంజుకుని, సిఫార్సుల రూపకల్పన ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా, ఉద్యోగుల్లో అంచనాలు గరిష్ట స్థాయిలో ఉండటంతో, రాబోయే రోజుల్లో కేంద్రం తీసుకునే నిర్ణయం కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.