ONGC Gas: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కు చెందిన సహజ వాయువును భారీ స్థాయిలో అనుమతిలేకుండా వెలికితీసిందన్న ఆరోపణలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) దాని చైర్మన్ ముఖేష్ అంబానీపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించి నోటీసులు జారీ చేసినట్టు లైవ్‌లా వెల్లడించింది. ప్రజా ప్రయోజన దృష్ట్యా జితేంద్ర పి. మారు దాఖలు చేశారు.
పిటిషన్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. 2004 నుంచి 2013-14 వరకూ రిలయన్స్ తన KG-D6 బ్లాకుల్లో తవ్విన సహజ వాయువులో గణనీయమైన భాగం పక్కనే ఉన్న ONGC బ్లాకుల నుంచి ప్రత్యక్షంగా వెలికితీసిందని.. ఈ వెలికితీత మొత్తం విలువ సుమారు 1.55 బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 13,000–14,000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. అదనంగా వడ్డీతో కలిపితే మరో 174 మిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రిలయన్స్, దాని డైరెక్టర్లపై గ్యాస్ దొంగతనం, నమ్మకద్రోహం, దుర్వినియోగం వంటి క్రిమినల్ నేరాల కింద కేసులు నమోదు చేయాలని, ఒప్పందాలు, తవ్వకాల వివరాలు, గ్యాస్ ప్రవాహ డేటా, AP షా కమిటీ రిపోర్ట్ వంటి కీలక పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ డిమాండ్ చేస్తోంది. అయితే RIL మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.
తమ బ్లాక్‌లలో దొరికిన గ్యాస్ సహజంగానే ఒక బ్లాక్ నుంచి మరొకదానికి వెళ్లే వలస గ్యాస్ మాత్రమేనని.. ఇది చట్టవిరుద్ధం కాదని తెలిపింది. అంతర్జాతీయంగా సాధారణమైన భూగర్భ ప్రక్రియ అని వాదిస్తోంది. ఈ వివాదం కొత్తది కానందున ఇది పాత ఆర్బిట్రేషన్ సమస్యలో భాగమని కంపెనీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ కన్సల్టెంట్ D&M కూడా గ్యాస్ మైగ్రేషన్ జరిగినట్టు గుర్తించినప్పటికీ, దాని చట్టపరమైన బాధ్యత ఎవరిది అన్నది ఇంకా స్పష్టతకు రాలేదని రిలయన్స్ అభిప్రాయపడుతోంది.
కోర్టు జారీ చేసిన తాజా నోటీసుల నేపథ్యంలో ఇప్పుడు సీబీఐ ఇచ్చే సమాధానమే కీలకంగా మారింది. దర్యాప్తు ప్రారంభిస్తే RIL, దాని డైరెక్టర్లపై FIR నమోదుకావచ్చు. గ్యాస్ తవ్వకం, బ్లాక్ సరిహద్దులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కేసు మరింత ముందుకు సాగితే రిలయన్స్ షేర్ ధర నుంచి మొత్తం ఎనర్జీ రంగం వరకు ప్రభావం చూపే అవకాశముండగా, గ్యాస్ బ్లాక్ పంపిణీ విధానాలు, ప్రభుత్వ ఇంధన విధానాలపై కూడా దీని పరిణామాలు పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









