)
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. గాజాలో కొనసాగుతున్న రక్తపాతం ముగించి శాశ్వత శాంతిని తీసుకురావడమే తన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. అయితే నోబెల్ శాంతి బహుమతిపై తాను ఆసక్తి చూపడం లేదని ట్రంప్ క్లియర్‌గా చెప్పారు. గాజా సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదించిన శాంతి సూత్రాలను హమాస్ అంగీకరించేందుకు మూడు నుంచి నాలుగు రోజుల గడువు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ ఒప్పందంపై ఇప్పటికే ఇజ్రాయెల్‌తో పాటు అరబ్ దేశాలు కూడా అంగీకరించాయని ట్రంప్ తెలిపారు. అనేక ముస్లిం దేశాలు కూడా సానుకూలంగా స్పందించాయని ఆయన వెల్లడించారు. ఇప్పుడు హమాస్ నుంచి సమాధానం రావాల్సి ఉందని, వారు తిరస్కరిస్తే గాజా పరిస్థితులు మరింత విషాదకరంగా మారతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్ తన కర్తవ్యాన్ని తప్పకుండా నెరవేర్చుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఇప్పటికే 25 వేల మందికి పైగా హమాస్ మిలిటెంట్స్ హతమయ్యారని.. వారి నాయకత్వాన్ని మూడు సార్లు కూలదోశామని ట్రంప్ తెలిపారు. ఈ దశలో హమాస్ శాంతిని కోరుకోవడమే మంచిదని, లేకపోతే యుద్ధం మరింత భయంకర స్థాయికి చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు.
గాజా అంశంపై మాట్లాడుతూ ట్రంప్ రష్యా బెదిరింపులను కూడా ప్రస్తావించారు. మాస్కో నుంచి వస్తున్న హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం లేదని, ఇప్పటికే రష్యా తీర ప్రాంతంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించామని ఆయన వెల్లడించారు. అణ్వాయుధాల శక్తి విషయానికి వస్తే, అమెరికా వద్ద ఉన్న సామర్థ్యం ప్రపంచంలోని ఏ దేశానికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచానికి ట్రంప్ ఇచ్చిన సందేశం స్పష్టంగా ఒకటే .. శాంతి కోసం మార్గం అందుబాటులో ఉందని, కానీ ఆ మార్గాన్ని తిరస్కరిస్తే పరిణామాలు ఘోరం అవుతున్నాయన్నారు. హమాస్ నిర్ణయం గాజా భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందో నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook