)
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సుంకాల బెదిరింపులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తే భారత్‌పై భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు చైనాపై కన్నేశారు. నవంబర్ 1వ తేదీ లోపు అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదరనట్లయితే చైనాపై సుంకాలను 155 శాతం వరకు పెంచుతానని ఆయన కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
వైట్‌హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్‌తో సమావేశమైన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ సందర్భంగా అమెరికా , ఆస్ట్రేలియా మధ్య 8.5 బిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ, “చైనా ఇప్పటికే 55 శాతం సుంకాలు చెల్లిస్తోంది. కానీ జిన్‌పింగ్ న్యాయమైన ఒప్పందానికి సిద్ధం కాకపోతే ఆ సుంకాలను 155 శాతం వరకు పెంచుతాం,” అని హెచ్చరించారు.
చైనాకు అమెరికాపై ఉన్న గౌరవాన్ని వ్యంగ్యంగా ప్రస్తావించిన ట్రంప్, చాలా దేశాలు అమెరికాను దోపిడీ చేశాయని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని అన్నారు. “చైనా అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతోంది. మేము వాణిజ్యంలో న్యాయం కోరుతున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా అమెరికా ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, తన పాలనలో అది మారిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.
చైనాతో తాను సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. “మేము చైనాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామనే నమ్మకం ఉంది. ఇది ఇరు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభదాయకం అవుతుంది,” అని అన్నారు. అదే సమయంలో చైనా అరుదైన ఖనిజాల సరఫరాను రాజకీయ ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నం చేసిందని, తాను ఆ బెదిరింపులను సుంకాలతో సమర్థవంతంగా ఎదుర్కొన్నానని చెప్పారు.
ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో చైనాను సందర్శించాలన్న జిన్‌పింగ్ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. చైనా అధ్యక్షుడితో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 31 నుంచి దక్షిణ కొరియాలో జరగబోయే ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సమ్మిట్ (APEC)కు ట్రంప్ హాజరుకానున్నారు. అక్టోబర్ 29, 30 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటించే ఆయన, అక్కడ జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ ద్వైపాక్షిక సంబంధాలు, గ్లోబల్ వాణిజ్య సమీకరణలో కీలక పాత్ర పోషించనుందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.