)
World Billionaires Ranking: ప్రపంచ కుబేరుల జాబితాలో భారీ హైడ్రామా జరిగింది. టెక్ దిగ్గజం ఒరాకిల్ షేర్లు ఒక్కసారిగా పెరగడంతో, ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ల్యారీ ఎల్లిసన్ కొద్ది గంటల పాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ర్యాలీ ఎక్కువసేపు నిలువలేదు. మార్కెట్ ముగిసే సమయానికి షేర్లు కొంతమేర వెనక్కి తగ్గడంతో, మస్క్ తిరిగి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఒరాకిల్ తాజాగా ప్రకటించిన ఆర్థిక ఫలితాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కలిగించాయి. ఆదాయం, లాభాలు అంచనాలను మించి రావడంతో పాటు, కంపెనీ అందిస్తున్న AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ షేర్లను కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ఫలితంగా మార్కెట్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే స్టాక్ ధరలు 43శాతం వరకు ఎగబాకాయి. 1992 తర్వాత ఒరాకిల్ షేర్లు ఒకేరోజులో ఇంత పెరగడం ఇదే మొదటిసారి.
ఈ పెరుగుదల వల్ల ల్యారీ ఎల్లిసన్ సంపద ఒక్కరోజులోనే 101 బిలియన్ డాలర్లు (రూ. 9 లక్షల కోట్లు) పెరిగింది. ఆయన 81 ఏళ్ల వయసులో ప్రపంచ కుబేరుడిగా అవతరించడం అరుదైన ఘనతగా నిలిచింది. అయితే ఈ రికార్డు ఎక్కువసేపు నిలవలేదు. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఒరాకిల్ షేర్ల వృద్ధి 36శాతానికి పరిమితమైంది. దీంతో ఎల్లిసన్ సంపద పెరుగుదల 89 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఫలితంగా ఎలాన్ మస్క్ మళ్లీ నంబర్-1 స్థానాన్ని తిరిగి అందుకున్నారు. ప్రస్తుతం మస్క్ సంపద 384.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఎల్లిసన్ సంపద దానికి కేవలం 1 బిలియన్ తక్కువగా ఉంది.
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎక్కువకాలం ఆధిపత్యం చూపిన వ్యక్తి ఎలాన్ మస్క్. ఆయన 2021లో తొలిసారి నంబర్-1గా నిలిచారు. అప్పటి నుంచి ఎక్కువ రోజులు ఆ స్థానంలో కొనసాగుతున్నారు. మధ్యలో ఫ్రాన్స్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అగ్రస్థానంలోకి వచ్చినప్పటికీ, ఎక్కువకాలం నిలబడలేదు. మస్క్ మాత్రం 2024లో 300 రోజులకు పైగా వరుసగా నంబర్-1 స్థానంలో కొనసాగారు. బుధవారం కూడా కొద్దిగంటల పాటు ఆ స్థానాన్ని కోల్పోయినా, వెంటనే తిరిగి సాధించారు.
ల్యారీ ఎల్లిసన్‌కు ఈ ఘనత కొద్ది గంటలపాటు మాత్రమే లభించినా, అది టెక్ రంగంలో ఆయన స్థాయిని మరోసారి రుజువు చేసింది. ఒరాకిల్ షేర్ల ర్యాలీ ఆయనను ప్రపంచ కుబేరుడిగా నిలిపినా, మార్కెట్ సర్దుబాటు మస్క్‌ను తిరిగి అగ్రస్థానంలోకి తీసుకెళ్లింది. అయినప్పటికీ, AI బూమ్ కారణంగా వచ్చే రోజుల్లో ఒరాకిల్ మరిన్ని సర్ప్రైజులు ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.