)
Gold Rate Today: బంగారం మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నడూ లేనంతగా పెరిగిన పసిడి రేట్లు, తాజాగా మరింత ఎగబాకి ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరాయి. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,730గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,800 పలుకుతోంది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఒక్క కిలోకు రూ.1,31,267 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఒక్కో ఔన్స్ ధర $3,707కు చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి రేట్లు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. ఇది దేశీయంగా కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడమే కాకుండా, ఈ ఏడాది చివరి వరకు మరో రెండు సార్లు రేట్ల కోతలు చేసే అవకాశం ఉందని సూచించింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించడం వల్ల అమెరికా డాలర్ విలువ గణనీయంగా పడిపోయింది. డాలర్ ఇతర కరెన్సీలతో పోలిస్తే బలహీనపడటంతో బంగారం మీద పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరిగింది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి సేఫ్ హావెన్ అసెట్స్ వైపు మళ్లిస్తారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడి కూడా తగ్గడంతో, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును బంగారంపై కేంద్రీకరించడం సహజమేనని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు కూడా బంగారాన్ని మరింత సురక్షిత పెట్టుబడిగా నిలిపాయి. చైనా సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం వల్ల అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు 40 శాతం మేర పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం, ప్రస్తుత పరిస్థితులు అలాగే కొనసాగితే ఔన్స్ బంగారం ధర $4,000 దాటే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాల కారణంగా నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉందని, అదే సమయంలో వృద్ధి రేటు బలహీనపడే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
దేశీయంగా చూస్తే, పసిడి ధరలు ఇంతలా పెరగడంతో బంగారు ఆభరణాల షాపులు వెలవెలబోతున్నాయి. పండుగ సీజన్ ముందుగానే ప్రారంభమైనా, అధిక రేట్ల కారణంగా వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. దీంతో బంగారు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇకపై ధరలు మరింత ఎగిసిపోతాయా లేదా తగ్గుతాయా అన్నది గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.