)
PSU General Insurance: భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సాధారణ బీమా రంగంలో భారీ మార్పులకు మరోసారి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు.. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ విలీనం ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా మళ్లీ పునఃపరిశీలిస్తోంది. ఈ మూడు కంపెనీలను ఒకే గొడుగు కింద తీసుకువస్తే సంస్థల పనితీరు మెరుగుపడటం, ఆర్థిక స్థిరత్వం పెరగడం, కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ సులభతరం కావడం, పోటీ సామర్థ్యం పెరగడం సాధ్యమని కేంద్రం భావిస్తుంది.
అయితే గత కొన్నేళ్లలో ఈ సంస్థలు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాయి. 2019-20 నుండి 2021-22 మధ్య ప్రభుత్వమే ఈ కంపెనీలను నిలదొక్కుకునేలా చేయడానికి రూ.17,450 కోట్ల మూలధనాన్ని అందించింది. పరిస్థితి మరింత దిగజారడంతో 2020లో అదనంగా రూ.12,450 కోట్లను ప్రభుత్వం ఇంజెక్ట్ చేసింది. ఈ చర్యలతో సంస్థలు కొంతవరకు ఊపిరిపీల్చుకున్నప్పటికీ, దీర్ఘకాలికంగా బలంగా నిలవాలంటే విస్తృత స్థాయి సంస్కరణలు తప్పనిసరిగా అవసరమని కేంద్రం అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ఈ మూడు సంస్థలను ఒకటిగా విలీనం చేస్తే వచ్చే ప్రయోజనాలను అంచనా వేసేందుకు ప్రాథమిక అధ్యయనం కొనసాగుతోంది. శాఖల సమీకరణ, ఖర్చుల తగ్గింపు, ఒకే పెద్ద కంపెనీగా మార్కెట్లో బలపడి నిలబడే సామర్థ్యం, అధునాతన టెక్నాలజీ అమలు.. ఇవి విలీనానికి అనుకూలతను పెంచుతున్న అంశాలు. మరోవైపు, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకదాన్ని ప్రైవేటీకరించే ప్రతిపాదనపై కూడా అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయం పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
2021–22 బడ్జెట్లో ప్రకటించిన పెద్ద సంస్కరణల భాగంగా, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ చట్టం, 2021ను పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ద్వారా బీమా కంపెనీల్లో ప్రభుత్వ కనీస వాటా 51శాతంగా ఉండాలన్న నిబంధన తొలగించింది. దీతో ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులకు మార్గం పూర్తిగా తెరిచింది.
అదే దిశగా.. FDI పరిమితిని 74శాతం నుండి 100శాతానికి పెంచే బిల్లును రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీన్ని ఆమోదిస్తే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు భారత్‌లో నేరుగా పెట్టుబడి పెట్టే అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్లో నూతన టెక్నాలజీ, విస్తృత ఉత్పత్తులు, మరింత పోటీ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద, ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ రంగం భారీ మార్పుల దిశగా కదులుతోంది. విలీనం, ప్రైవేటీకరణ, FDI పెంపు వంటి కీలక సంస్కరణలు అమల్లోకి వస్తే, భారత బీమా రంగం పూర్తిస్థాయి పునర్నిర్మాణ దశలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.