)
Hero Motors IPO: దేశంలోని ప్రముఖ ఆటో భాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఈ సంస్థకు ఆమోదం ఇచ్చింది. దీంతో కంపెనీ ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా సుమారు రూ.1,200 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని సెప్టెంబర్ 15న కంపెనీ ఫైలింగ్‌లో అధికారికంగా ప్రకటించింది.
హీరో మోటార్స్ IPOలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది ఫ్రెష్ ఇష్యూ, అంటే కొత్తగా షేర్లు జారీ చేయడం ద్వారా రూ.800 కోట్లు సమీకరించనుంది. రెండవది ఆఫర్ ఫర్ సేల్ (OFS), ఇందులో ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లు తమ వాటాలను విక్రయించి సుమారు రూ.400 కోట్లు సమకూర్చనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ వ్యూహాత్మకంగా వినియోగించనుంది. ఇందులో రూ.285 కోట్లు అప్పులు తీర్చడానికి, రూ.237 కోట్లు గౌతమ్ బుద్ధ నగర్ ప్లాంట్‌లో ఆధునిక యంత్రాల కొనుగోలు కోసం కేటాయించనుంది. మిగతా మొత్తాన్ని కొత్త పెట్టుబడులు, విస్తరణ పనులు మరియు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది.
ఐపీఓలో OFS విభాగంలో ప్రధానంగా ఓపీ ముంజల్ హోల్డింగ్స్ భాగస్వామ్యం వహించనుంది. ఇది రూ.390 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. అదనంగా భాగ్యోదయ ఇన్వెస్ట్మెంట్స్, హీరో సైకిల్స్ తలో రూ.5 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. OFS ద్వారా వచ్చే ఆదాయం కంపెనీకి కాకుండా వాటాలను విక్రయించే షేర్‌హోల్డర్లకే వెళ్తుంది.
షేర్ల కేటాయింపుల విషయంలో కూడా స్పష్టమైన విభజన ఉంది. మొత్తం ఐపీఓలో 50శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల (QIBs)కు, 15శాతం నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NIIs), మిగతా 35శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. అదనంగా, కంపెనీ ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా రూ.160 కోట్లు సమీకరించేందుకు యోచిస్తోంది. దీని ద్వారా కొత్తగా జారీ చేయాల్సిన షేర్ల పరిమాణం తగ్గే అవకాశం ఉంది.
ఈ IPO నిర్వహణ బాధ్యతలను ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు చేపట్టాయి. వీటిలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, జేఎం ఫైనాన్షియల్ ఉన్నాయి. రిజిస్ట్రార్‌గా కేఫిన్ టెక్నాలజీస్ వ్యవహరించనుంది. హీరో మోటార్స్‌ను ప్రస్తుతం పంకజ్ ముంజల్ నడిపిస్తున్నారు. ఆయన హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ బంధువు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, హీరో మోటార్స్ మొదట 2024 ఆగస్టులో రూ.900 కోట్ల IPO కోసం దరఖాస్తు చేసింది. అయితే, తరువాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2025 జూలైలో కొత్తగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సమర్పించి IPO పరిమాణాన్ని రూ.1,200 కోట్లకు పెంచింది.
హీరో మోటార్స్ ప్రధానంగా టూ వీలర్ల కోసం ఇంజిన్లు, ట్రాన్స్మిషన్ భాగాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా బీఎండబ్ల్యూ, డుకాటీ, హార్లీ డేవిడ్సన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లకు కూడా సరఫరా అవుతున్నాయి. దీంతో, IPOపై ఇన్వెస్టర్లలో మంచి ఆసక్తి ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే, IPOకి సంబంధించిన ధరల శ్రేణి (Price Band), సబ్స్క్రిప్షన్ తేదీలు వంటి కీలక వివరాలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. ఈ IPO ద్వారా వచ్చే నిధులు కంపెనీకి అప్పుల భారాన్ని తగ్గించడమే కాకుండా, ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడంలో కూడా కీలకంగా ఉపయోగపడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.