Rupee vs Dollar: గత కొన్నాళ్లుగా భారత రూపాయి విలువ క్రమంగా తగ్గడం మనం గమనించవచ్చు. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ ఇప్పటి వరకు కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ ధర.. రూపాయి బలాన్ని లేదా బలహీనతను సూచిస్తుంది. ఒక డాలర్ విలువ తక్కువగా ఉంటే.. రూపాయి బలపడుతుంది. అదే డాలర్ విలువ ఎక్కువగా ఉంటే రూపాయి విలువ బలహీనపడుతుంది. మార్చి 2026నాటికి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు నివేదికలు వెలువడిన నేపథ్యంలో గురువారం ఇంట్రాడే ట్రేడింగ్ లో రూపాయి 54పైసలు తగ్గింది. 90.48వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి నాటికి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ చెప్పిన అనంతరం రూపాయి విలువ కొత్త ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుకుందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రూపాయి ఎందుకు క్షీణిస్తుందన్న ప్రశ్న ప్రజల్లో మొదలైంది. ఈ క్షీణత ఇంతకు ముందు జరిగిందా? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాలంలో లేదా ప్రధాని మోదీ హయాంలో ఎప్పుడు రూపాయి విలువ ఎక్కువగా పడిపోయింది? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
మోదీ పాలనలో రూపాయి పతనం?
2014 ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంలో ఒక డాలర్ విలువ 58.58 రూపాయలుగా ఉంది. ఇప్పుడు డాలర్ విలువ దాదాపు 90 రూపాయిలు. అంటే మోదీ సర్కార్ వచ్చాక రూపాయి విలువ 52శాతానికి పడిపోయింది. గత ఏడాది కాలంలో డాలర్ తో పోలిస్తే రూపాయి కూడా గణనీయంగా పడిపోయింది. సెప్టెంబర్ 2023లో ఒక డాలర్ విలువ 83. 51 రూపాయిలుగా ఉంది. అదే సెప్టెంబర్ 2024లో అది 88.74రూపాయలకు పెరిగింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే రూపాయి 6శాతానికిపైగా క్షీణించింది.
మన్మోహన్ కాలంలో రూపాయి విలువ ఎలా ఉండేది?
2004లో మన్మోహన్ సింగ్ అధికారం చేపట్టినప్పుడు డాలర్ విలువ 45.45 రూపాయలుగా ఉండగా.. 2014లో ఆయన పదవీ కాలం ముగిసే సమయానికి డాలర్ విలువ 58.58 రూపాయలకు చేరింది. అంటే 10ఏళ్లలో రూపాయి విలువ దాదాపు 29శాతం మేర తగ్గింది. మోదీ హయాంలో రూపాయి విలువ వేగంగా ఉంది. అంటే రూపాయి పతనం మొత్తం 29 శాతం మాత్రమే. ఇది మోదీ ప్రభుత్వంలో జరిగిన 52 శాతం పతనంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి. ఈ రెండింటిని సరిపోల్చితే మోదీ పాలనలో రూపాయి విలువ పడిపోయే వేగం మన్మోహన్ సింగ్ కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపు ఎక్కువ అని చెప్పాలి. అందుకే రూపాయి ఎందుకు ఇంత బలహీనపడింది అనే ప్రశ్న మోదీ హయాంలో ఎక్కవగా వినిపిస్తోంది.
భారత్ అప్పు:
అయితే మోదీ సర్కార్ చేసిన కొన్ని ఆర్థిక సంస్కరణలు కూడా గమనించదగ్గవే. భారత్ కు సంబంధించి విదేశీ అప్పు 2014లో 440.6 బిలియన్ డాలర్లు ఉండగా, 2023లో అది 613 బిలియన్ డాలర్లకు పెరిగింది. విదేశీ అప్పు పెరగడం సాధారణంగా ఆందోళనకరమే అయినప్పటికీ.. అదే సమయంలో భారత విదేశీ మారక నిల్వలు 304 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 596 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వం అప్పు తీసుకున్నా.. దానికి సమానంగా విదేశీ నిల్వలను కూడా పెంచి ఒక రక్షణ వలయాన్ని నిర్మించింది. అదేవిధంగా వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీలో భారతదేశం ర్యాంకింగ్ 134 నుంచి 63వ స్థానానికి చేరడం కూడా ఒక ముఖ్యమైన మార్పు అని చెప్పాలి.
అయితే ఈ సానుకూల అంశాలు ఉన్నప్పటికీ రూపాయి పతనాన్ని పూర్తిగా ఆపలేకపోయాయి. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ బలపడటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడి ప్రవాహం తగ్గడం వంటి బాహ్య కారణాలు దీనిపై తీవ్రమైన ప్రభావం చూపాయి. దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడి, దిగుమతులు పెరగడం, ఎగుమతులు అనుకున్నంతగా వేగం పట్టకపోవడం వంటి అంశాలు రూపాయి విలువను ఇంకా బలహీనపరిచాయి.
మొత్తానికి.. రూపాయి పతనం అనేక కారణాల కలయిక అయినప్పటికీ.. గణాంకాలు చూస్తే మోదీ హయాంలో రూపాయి చాలా వేగంగా పడిపోయిందని స్పష్టంగా కనిపిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని బలపర్చే చర్యలు తీసుకున్నప్పటికీ, రూపాయి క్షీణత మాత్రం గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి చేరింది. అయితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో భారత్ ర్యాంక్ 132 నుంచి 134కు చేరింది. అదే మోదీ హయాంలో 134 నుంచి 64కి చేరింది. అంటే దీని అర్థం వ్యాపారాన్ని ప్రారంభించడం, నడపడం, మునుపటి కంటే ఇప్పుడు సులభం అయ్యిందని అర్థం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









