Stock Market: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ దాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పెరిగింది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ పై కూడా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ..దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 950పాయింట్లు పతనం అవ్వగా..నిఫ్టీ 24వేల మార్క్ ను కోల్పోయింది. బీఈఎస్ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మార్కెట్ విలువలో రూ. 7.5లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది.
శుక్రవారం నాటి ట్రేడింగ్ ను సూచీలు సానుకూలంగానే ప్రారంభించినప్పటికీ..కొద్దిసేపటికే అమ్మకాలు ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం 11గంటల సమయంలో సెన్సెక్స్ 952.7 పాయింట్లు కుంగి 78,850.71 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 324.7పాయింట్లు దిగజారి 23,922.05 దగ్గర కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1.56శాతం మేర నష్టాల్లో ఉంది. నిఫ్టీ మీడియా 3.54 శాతం, నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్ సూచీ 2.87 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.69 శాతం నష్టపోయాయి. ప్రధాన బ్యాంకులు అయిన ఎస్బీఐ షేర్లు, 2.71శాతం, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 0.62శాతం, ఐసీఐసీఐ షేర్లు 0.42 శాతం మేర కుంగిపోయాయి.
పహల్గామ్ దాడితో భారత్, పాక్ మధ్య నెలకున్న ఉద్రికత్త పరిస్థితులను మదుపర్లు నిషితంగా గమనిస్తున్నారు. దీంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అటు అంతర్జాతీయంగా నెలకున్న అనిశ్చిత పరిస్థితులు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఆసియా పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.91 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.03శాతం, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.75శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ మార్కెట్లు వరుసగా మూడోరోజు బాగానే రాణించాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో ఎస్ అండ్ పీ సూచీ 2.03శాతం, నాస్ డాగ్ 2.74శాతం, డోజోన్స్ 1.23శాతం మేర లాభపడ్డాయి.
భారత్ పాకిస్తాన్ చివరిసారిగా 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో నేరుగా యుద్ధానికి దిగాయి. అప్పట్లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, మన స్టాక్ మార్కెట్ (Nifty 50 ) యుద్ధానికి ముందే సుమారు 13 శాతం పడిపోయింది. అంటే చాలా మంది ఇన్వెస్టర్లు భయంతో షేర్లను అమ్మేశారు. ఎందుకంటే, యుద్ధం జరిగే అవకాశం ఉందని భయపడ్డారు.
అయితే యుద్ధం మొదలైన తర్వాత అనూహ్యంగా Nifty 50 సూచీ 41 శాతం పెరిగింది. తగ్గినట్లే తగ్గి భారీగా పెరగడానికి కారణం భారత సైన్యం విజయవంతంగా ముందుకు దూసుకెల్లడం యుద్ధం పెద్దగా పొడిగించకుండా త్వరగా ముగుస్తుందని నమ్మకం ఏర్పడటం ఇన్వెస్టర్లను మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రోత్సహించింది. దీనికి తోడు అప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా స్టాక్ మార్కెట్ పెరగడానికి తోడ్పాటు అందించాయి. నిజానికి యుద్ధం జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు మాత్రమే ఆందోళనలతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయిస్తారు. కానీ ఒకసారి యుద్ధం ప్రారంభం అయ్యాక మన సైన్యం విజయం సాధిస్తుంది అంటే మాత్రం మార్కెట్ సెంటిమెంట్ బలపడే అవకాశం ఉంటుంది, అని కార్గిల్ యుద్ధం నాటి అనుభవం మనకు చెబుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









