)
India IPO Market 2025: దేశీయ ఐపీఓ మార్కెట్ మరోసారి ఎవరూ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ఈ వారం మెయిన్ బోర్డ్‌లో మూడు పెద్ద ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు వచ్చాయి. వాటికి పెట్టుబడిదారుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. ఈ మూడు కంపెనీలు కలిపి కేవలం రూ. 2,400 కోట్లు సమీకరించాలనుకున్నా, దానికి బదులు దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల బిడ్లు వచ్చాయి. అంటే ఇన్వెస్టర్లు ఐపీఓలపై ఎంత క్రేజ్ చూపిస్తున్నారో ఈ సంఖ్యలు చెబుతున్నాయి.
అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ స్పందన:
ఈ మూడు ఐపీఓల్లో అర్బన్ కంపెనీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంపెనీ టార్గెట్ కేవలం రూ. 1,900 కోట్లు సమీకరించడమే. అయితే పెట్టుబడిదారుల బిడ్లు ఏకంగా రూ. 1.13 లక్షల కోట్లను దాటేశాయి. షేరు ధర రూ. 103 గా ఉండగా, ఇది 103 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో కూడా ఈ షేర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒక్కో షేరు దాదాపు 40శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతుండటం గమనార్హం.
దేవ్ డెవలపర్స్ ఐపీఓ:
మరోవైపు, దేవ్ డెవలపర్స్ ఐపీఓ ద్వారా రూ. 143 కోట్లు సమీకరించాలనుకున్నారు. కానీ బిడ్లు ఏకంగా రూ. 5,124 కోట్లకు చేరాయి. ఇది 64 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందింది. ఈ ప్రాజెక్టుపై కూడా ఇన్వెస్టర్లలో గట్టి ఆసక్తి కనిపించింది.
శ్రీనగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీఓ:
ఇక మూడో ఐపీఓ శ్రీనగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్రది. కంపెనీ టార్గెట్ రూ. 400 కోట్లు సమీకరించడమే. అయితే ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 16,927 కోట్ల బిడ్లు వేశారు. ఇది 60 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందింది. ఆభరణాల రంగంలో ఉన్న క్రేజ్ ఈ ఐపీఓకూ బలమైన మద్దతు ఇచ్చింది.
ఐపీఓలపై నిపుణుల హెచ్చరిక:
ప్రస్తుతం పెట్టుబడిదారులు ఐపీఓల వైపు పెద్ద ఎత్తున పరుగులు పెడుతున్నా, నిపుణులు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ కంపెనీ ఐపీఓ విషయంలో వాల్యుయేషన్ కాస్త ఎక్కువగా ఉందని, దీర్ఘకాలం పెట్టుబడి పెడితేనే లాభాలు దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునేవారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
2024లో భారత ఐపీఓ రికార్డులు:
2024లో భారత ఐపీఓ మార్కెట్ ప్రపంచంలోనే టాప్ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు కంపెనీలు రూ. 1.5 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగుతోంది. సెబీ ఇప్పటివరకు రూ. 1.14 లక్షల కోట్ల విలువైన ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో రూ. 1.64 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. సంవత్సరం చివరికి కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
లిస్టింగ్ ఎప్పుడంటే?
ఈ మూడు ఐపీఓల షేర్ల కేటాయింపు ప్రక్రియ సోమవారం పూర్తవుతుందని సమాచారం. సెప్టెంబర్ 17న బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ లిస్టింగ్ తర్వాత షేర్ల పనితీరుపై ఇన్వెస్టర్ల దృష్టి కేంద్రీకృతమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.