)
LG India IPO Listing Price: భారీ అంచనాలతో సోమవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన టాటా క్యాపిటల్స్ ఐపీఓ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మాత్రం దుమ్మురేపింది. ఏకంగా 50శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యింది. దీంతో ఇన్వెస్టర్ల పంట పండిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మాత్రం అక్కడి నుంచి కాస్త వెనక్కు తగ్గింది. అయినా కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలనే అందించిందని చెప్పాలి. ఈ ఐపీఓకు ఊహించని రీతిలో సబ్ స్క్రిప్షన్ లభించిన విషయం తెలిసిందే.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక ఇన్వెస్టర్ కు ఐపీఓలు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. కొత్త కంపెనీ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందంటే..మంచి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఇన్వెస్టర్లు ఆశిస్తుంటారు. ఈ మధ్యే దేశీయ మార్కెట్లో రెండు ఐపీఓలు హాట్ టాపిగ్గా మారాయి. అందులో ఒకటి టాటా క్యాపిటల్ ఐపీఓ, రెండవి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ. వీటిలో టాటా క్యాపిటల్ ఐపీఓ ఇన్వెస్టర్లకు అంతగా లాభం చేకూర్చలేకపోయినా.. ఎల్జీ ఐపీఓ మాత్రం తొలిరోజే రికార్డులు బద్దలుకొట్టి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
మంగళవారం (అక్టోబర్ 14, 2025) నాడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్ రోజు నుంచే ఈ ఐపీఓ దుమ్మురేపింది. ఇష్యూ ధర రూ. 1,140గా నిర్ణయించగా, లిస్టింగ్ వెంటనే ఎన్ఎస్ఈలో రూ. 1,710 వద్ద ప్రారంభమైంది. అంటే ఏకంగా 53శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఈ ఒక్క లిస్టింగ్‌తోనే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిసింది. ఒక్కో షేరుపై రూ. 570 లాభం రావడం విశేషం.
ఇక ఒక్కో లాట్లో 13 షేర్లు ఉన్నాయని గమనిస్తే, ఇష్యూ ధర ప్రకారం పెట్టుబడి రూ. 14,820 అవుతుంది. అదే లిస్టింగ్ ధర రూ. 1,710కి పెరిగిన నేపథ్యంలో ఒక్కో లాట్‌పై రూ. 7,411 లాభం వచ్చినట్లు లెక్క. ఇంట్రాడేలో షేర్ రూ. 1,749 వరకు ఎగబాకగా, అక్కడ అమ్మిన ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 8,000 లాభం దక్కింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి షేర్ రూ. 1,680 వద్ద ట్రేడవుతూ, ఇంకా 47శాతం ప్రీమియంతోనే కొనసాగడం గమనార్హం.
ఇక ఐపీఓ సబ్స్క్రిప్షన్ దశలోనే ఎల్జీ రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 7 నుండి 9 వరకు బిడ్డింగ్ నిర్వహించగా, కంపెనీ లక్ష్యం కేవలం రూ. 11,000 కోట్లు సమీకరించడం మాత్రమే. అయితే ఇన్వెస్టర్ల స్పందన అంచనాలను మించి రూ. 4.39 లక్షల కోట్లు విలువైన బిడ్స్ నమోదయ్యాయి. ఇది భారత ఐపీఓ చరిత్రలో అరుదైన ఘనత. మొత్తం సబ్స్క్రిప్షన్ 54 రెట్లు చేరడం ద్వారా ఈ ఐపీఓకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఇక టాటా క్యాపిటల్ ఐపీఓతో పోలిస్తే, ఎల్జీ ఐపీఓ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని గెలుచుకుంది. టాటా క్యాపిటల్ షేర్ ఇష్యూ ధర దగ్గరే ఫ్లాట్‌గా లిస్టై నిరాశ కలిగించగా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తొలిరోజే సగం లాభం ఇచ్చి హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్టింగ్ విజయంతో మార్కెట్లో ఎల్జీ తన బ్రాండ్ విలువను మరింత పెంచుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook