)
Maoist surrender: దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అగ్రనేతలు ఒకరి తరువాత ఒకరు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు (అశన్న అలియాస్ రూపేశ్) ఆధ్వర్యంలోని సుమారు 70 మంది కేడర్లు ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు లొంగిపోనున్నారు. వీరితోపాటు పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు కూడా ఉన్నారు. బుధవారం గడ్చిరోలిలో పాలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (అభయ్) సహా 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో కలిసి లొంగిపోయారు. ఈ వరుస లొంగుబాట్లు మావోయిస్టు ఉద్యమం నీరుగారినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.
తక్కళ్లపల్లి వాసుదేవరావు నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులై అజ్నాతంలోకి వెళ్లారు. మొదట కాకతీయ వర్సిటీ సీపీఐ పీపుల్స్ వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు ఆయన నాయకత్వం వహించారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం అప్పటి హన్మకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్ లో సెకండరీ విద్యను అభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత పరిణమాల నేపథ్యంలో 25ఏళ్ల వయసులోనే అజ్నాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయస్సు 60ఏళ్లపైనే ఉంటుంది.
ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా దండకారణ్యం ప్రాంతం మావోయిస్టుల ప్రధాన అడ్డాగా కొనసాగింది. అయితే ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు సాంకేతిక సదుపాయాలు, డ్రోన్లు, హైటెక్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో బలంగా ముందుకు రావడంతో, మావోయిస్టుల చలనం గణనీయంగా తగ్గింది. మరోవైపు, సర్కార్ తరఫున పునరావాస పథకాలు, ఆర్థిక ప్యాకేజీలు, లొంగుబాట్లకు భద్రతా హామీలు కూడా మావోయిస్టు కేడర్లను ప్రధాన ప్రవాహంలోకి తీసుకువచ్చాయి.
2000ల ప్రారంభంలో బలంగా విస్తరించిన ఈ ఉద్యమం, ఒకప్పుడు 13 రాష్ట్రాల్లో సుమారు 200 జిల్లాలకు వ్యాపించి, దాదాపు లక్షమంది కేడర్లతో వ్యవహరించేది. కానీ 2024 నాటికి ఈ సంఖ్య 20-25 జిల్లాలకు తగ్గిపోయింది. భారత ప్రభుత్వం అమలు చేసిన సమాధాన్ వ్యూహం కింద నిఘా వ్యవస్థ బలోపేతం, రోడ్డు కనెక్టివిటీ పెంపు, గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు వంటి చర్యలు తీసుకోవడంతో మావోయిస్టుల దాడులు 70 శాతం తగ్గాయి.
ఒకవైపు నేరుగా ఎదురెదురుగా జరిగే ఎన్కౌంటర్లు, మరోవైపు లోపల నుంచే విభేదాలు, నాయకత్వ సంక్షోభం కూడా ఈ ఉద్యమాన్ని దెబ్బతీశాయి. పెద్ద నాయకులు లొంగిపోవడం లేదా హతమవ్వడం వల్ల కొత్త తరం నాయకత్వం సరిగా ఎదగలేకపోయింది. పైగా, గ్రామీణ యువతలో ఇప్పుడు ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ పథకాలు వంటి అవకాశాల పట్ల ఆకర్షణ పెరిగింది. దీంతో మావోయిస్టుల ప్రభావం తగ్గిందనే చెప్పాలి.
తాజాగా వాసుదేవరావు నేతృత్వంలో జరుగుతున్న లొంగుబాటు, ఈ ఉద్యమానికి మరొక కీలక మలుపు అని చెప్పవచ్చు. ఒకప్పుడు విప్లవం పేరిట ఆయుధాలు ఎత్తుకున్న వారు, ఇప్పుడు అదే చేతులతో శాంతి జెండా ఎగురవేస్తున్నారు. మావోయిస్టు ప్రభావం తగ్గిపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగం అందుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
భారతదేశంలో గత 50 ఏళ్లుగా కొనసాగిన నక్సలైట్ ఉద్యమం, ఇప్పుడు చివరి దశలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపాకీతో వచ్చినవారే, ఇప్పుడు కలం పట్టి నూతన జీవితం మొదలుపెడుతున్నారు ఇదే ఈ లొంగుబాట్ల నిజమైన సందేశమని విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook