)
India-Nepal Trade: నేపాల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, పర్యాటక రంగాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రెండు రంగాలు దేశానికి సరిపోవడం లేదు. అందుకే నేపాల్ వాణిజ్యం మొత్తం మీద 60 శాతం కంటే ఎక్కువగా భారతదేశంపైనే ఆధారపడి ఉంటుంది. ల్యాండ్‌లాక్ దేశం కావడంతో చైనా, భారత్ సరిహద్దులు ఉన్నప్పటికీ వాణిజ్యం, అవసరాల పరంగా నేపాల్ ఎక్కువగా భారతదేశం నుంచి ఆశ్రయం కోరుకుంటోంది. చైనాతో సరిహద్దు ఉన్న ప్రదేశాలు హిమాలయ పర్వతాలతో కప్పబడి ఉండటం వలన అక్కడ వాణిజ్యం జరగడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ భారతదేశం భౌగోళికంగాను, సాంస్కృతికంగాను నేపాల్‌కు దగ్గరగా ఉండటంతో రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి.
2024 గణాంకాల ప్రకారం, భారత్ నుండి నేపాల్‌కు 6.95 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కూడా ఎగుమతి అవుతున్నాయి. నేపాల్ నుండి భారత్‌కు కేవలం 867 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. ఈ గణాంకాలు చూసినా నేపాల్ భారతదేశంపైనే అధికంగా ఆధారపడి ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా చమురు, విద్యుత్ అవసరాల కోసం నేపాల్ పూర్తిగా భారత్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ద్వారా చమురు సరఫరా జరుగుతుండగా, తక్కువ ధరలకు విద్యుత్ కూడా భారత్ అందిస్తోంది.
భారత్ నుండి నేపాల్‌కు వెళ్లే ప్రధాన ఉత్పత్తుల్లో పెట్రోలియం, ఉక్కు, ఇనుము, యంత్రాలు, బాయిలర్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లాస్టిక్, అల్యూమినియం, ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే.. 2024లో భారత్ నుండి నేపాల్‌కు 2.19 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులు, 700 మిలియన్ డాలర్ల ఉక్కు, ఇనుము, 429 మిలియన్ డాలర్ల యంత్రాలు, 352 మిలియన్ డాలర్ల వాహనాలు, విడిభాగాలు ఎగుమతి అయ్యాయి. ఇదే సమయంలో నేపాల్ భారత్‌కు ప్రధానంగా జనపనార ఉత్పత్తులు, ఉక్కు, ఫైబర్, చెక్క వస్తువులు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు వంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
ఇక మరోవైపు, ఇటీవల నేపాల్‌లో రాజకీయ అస్థిరత ఎక్కువైంది. డిజిటల్ సెన్సార్షిప్ వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారి, చివరికి ప్రధాని రాజీనామా వరకూ దారితీశాయి. ఈ అల్లర్లలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో నేపాల్ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి నేపాల్ పేరుకే స్వతంత్ర దేశం అయినప్పటికీ వాస్తవానికి ఆర్థికంగా, వాణిజ్యంగా పూర్తిగా భారతదేశంపైనే ఆధారపడి ఉంది. రాజకీయంగా కూడా జరుగుతున్న అస్థిరత కారణంగా ఆర్థిక భవిష్యత్తు మరింత క్లిష్టతరమవుతుందని నిపుణుల అభిప్రాయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.