)
New GST Rates: దేశంలో జీఎస్టీ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం GST 2.0 పేరుతో కొత్త పన్ను నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు 5-6 స్లాబ్‌లలో పన్నులు వసూలు చేసేవారు. అయితే ఇకపై కేవలం మూడు శ్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. అవి 5శాతం, 18శాతం, 40శాతం. ఈ మార్పుతో చాలా ఉత్పత్తులు చౌకగా మారే అవకాశం ఉంది. కానీ లగ్జరీ, ఆరోగ్యానికి హానికరమైనవి, ప్రత్యేక వర్గానికి చెందిన వస్తువులు మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఖరీదైనవిగా మారే వస్తువులు ఇవే:
కొత్త GST రేట్లలో 40శాతం స్లాబ్ కింద కొన్ని ఉత్పత్తులు చేరాయి. అందులో ముఖ్యంగా పానీయాలు, పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ వాహనాలు ఉన్నాయి. కోలా, ఎరేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ వాటర్ మొదలైన వాటిపై ఇప్పటివరకు 28శాతం పన్ను మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇవి 40శాతం పన్ను కింద వస్తాయి. ఫలితంగా ఈ పానీయాలను వినియోగించే వారికి అదనపు భారం పడనుంది. అదే విధంగా పాన్ మసాలా, నమలే పొగాకు, సిగరెట్లు, సిగార్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్ను 28శాతం నుండి 40శాతానికి పెరిగింది. ఇది ప్రజల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న అడుగుగా భావిస్తున్నారు.
లగ్జరీ వాహనాలు కూడా ఇప్పుడు మరింత ఖరీదవుతాయి. 350సీసీకి పైగా ఉన్న మోటార్ సైకిళ్లు, SUVలు, ఖరీదైన కార్లు కొత్త GST రేట్ల ప్రకారం 40శాతం పన్ను కిందకు వస్తాయి. ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు, యాచ్ట్లు, లగ్జరీ పడవలు వంటి విలాసవంతమైన రవాణా సాధనాలపై కూడా పన్ను భారీగా పెరుగుతోంది. అంతేకాకుండా, తుపాకులు, రివాల్వర్లు, పిస్టల్స్ వంటి వస్తువులపై కూడా ఇప్పుడు 40శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
5శాతం నుంచి 18శాతానికి పెరిగిన వస్తువులు:
కొన్ని ఇంధన పదార్థాలపై కూడా పన్ను పెరిగింది. బొగ్గు, లిగ్నైట్, పీట్ వంటి ఉత్పత్తులు ముందుగా 5 పన్ను కింద ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి 18శాతం కిందకు వస్తాయి. అలాగే మెంథాల్ ఉత్పత్తులు (పిప్పరమెంట్ ఆయిల్, స్పియర్మింట్ ఆయిల్ వంటివి) బయోడీజిల్ కూడా ఇకపై 18శాతం GST కిందకి వస్తాయి. అంటే పరిశ్రమలకు వీటి ఖర్చు పెరగనుంది.
ప్రజలపై ప్రభావం:
ఈ కొత్త రేట్ల ప్రభావం ప్రతి వర్గంపై వేర్వేరుగా ఉంటుంది. సాధారణ ప్రజలు వినియోగించే ఎక్కువ వస్తువులు చౌక అవుతాయి. అయితే, పానీయాలు, లగ్జరీ వాహనాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటిని వినియోగించే వారికి భారీగా ఖర్చు పెరుగుతుంది. మధ్యతరగతి, ఉన్నత తరగతి వినియోగదారులు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు.
ఈ మార్పుల ఉద్దేశ్యం:
ప్రభుత్వం ఈ మార్పులను రెండు కారణాల కోసం చేసింది. ఒకటి, జీఎస్టీ వ్యవస్థను సులభతరం చేయడం. చాలా స్లాబ్‌ల బదులు ఇప్పుడు కేవలం మూడు రేట్లతో సరళమైన నిర్మాణం తీసుకొచ్చింది. రెండవది, ఆరోగ్యానికి హానికరమైనవి, విలాసవంతమైన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం. అధిక పన్నుతో ఇవి అందరికీ అందుబాటులో లేకుండా చేసి, ప్రజలను ఆరోగ్యకరమైన, సమతుల్య వినియోగం వైపు మళ్లించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.